సాధారణంగా కళ్ల కలకలు వైరస్ వల్లే వస్తాయి. మన దగ్గర చాలా మంది వీటి బారిన పడుతుంటారు. కొద్ది రోజులపాటు ఉండి తగ్గిపోతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో తొలుత కళ్ల కలకతో వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ ఉన్నట్లు ఓ వైద్యుడు గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం తొలుత కొట్టిపారేసింది. తర్వాత పరిస్థితి తీవ్రమైంది. ముఖ్యంగా కరోనా బాధితుల్లో కొందరిలో ఎలాంటి లక్షణాలు పైకి కన్పించకపోవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు.
జ్వరం కూడా ఉంటే జాగ్రత్తపడాల్సిందే..
జలుబు, జ్వరం, పొడి దగ్గు, ఆయాసం... ఈ లక్షణాలే కాదు.. ప్రస్తుత పరిస్థితిలో కళ్ల కలకలు కన్పించినా కరోనాగా అనుమానించాల్సిందే. వీటితోపాటు జ్వరం కూడా ఉంటే... ఇంకా ప్రమాదం. ఇలాంటి వారిలో 90 శాతం కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని సరోజనీ దేవి నేత్ర వైద్యశాల వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో జ్వరం, కళ్ల కలకలతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మేలని పలువురు సూచిస్తున్నారు. సరోజినీ దేవి ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రం కొనసాగిస్తున్నారు. ఇక్కడ 145 మంది ఉన్నారు. నిత్యం ఆసుపత్రికి వచ్చే వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం లక్షణాలు కన్పిస్తే క్వారంటైన్ చేస్తున్నారు.
కళ్ల కలక రోగుల విషయంలో జాగ్రత్తలు
కరోనా వైరస్ ప్రభావం నేత్రాలపైనా ఉంటుంది. సాధారణంగా కళ్ల కలకలు వైరస్ ద్వారా వచ్చి కొద్ది రోజులు ఉండి తగ్గిపోతాయి. అయితే కరోనా వైరస్‌తో వచ్చే కలకలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిలో జ్వరం, ఇతర లక్షణాలు కన్పిస్తాయి. కళ్ల కలకతోపాటు జ్వరం ఉంటే 90 శాతం కరోనా ఉన్నట్లు అనుమానించి శాంపిళ్లు సేకరించి పరీక్షించాలి. సరోజినీదేవి ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఓపీ నిర్వహిస్తున్నాం. శనివారం 40 మంది వివిధ నేత్ర సమస్యలతో రాగా...ఇందులో నలుగురు కళ్ల కలకతో బాధపడుతున్నట్లు గుర్తించాం. వారిలో జ్వరం, ఇతర లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్స చేసి పంపించాం. 14 రోజులపాటు ఇంటి వద్దే ఉండాలని వారికి సూచించాం. - డాక్టర్ రాజలింగం, సూపరింటెండెంట్, సరోజనీ దేవి నేత్ర వైద్యశాల