తెలంగాణ

telangana

ETV Bharat / city

Online Food : రెస్టారెంట్‌లో ఓ ధర.. ఆన్‌లైన్‌లో మరోలా..? - extra charges on online food orders

లాక్‌డౌన్‌తో భాగ్యనగరంలో ఇంటి నుంచి పని చేసే సిబ్బంది, గృహిణులు, విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని రెస్టారెంట్లు బిల్లుపై అదనంగా పన్నులు, హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్‌ ఛార్జీల పేరుతో సుమారు రూ.70 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నాయి. గతంలో తార్నాకకు చెందిన విజయ్‌గోపాల్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఈ విషయమై సవాల్‌ చేయగా.. విచారించిన కమిషన్‌-2 బెంచ్‌ సంబంధిత రెస్టారెంట్‌కు రూ.10వేల జరిమానా, కేసు ఖర్చుల కింద రూ.5వేలు ఆయనకు చెల్లించాలని, పరిహారం కింద వినియోగదారుల సంక్షేమనిధికి రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.

biryani bill, online foos, extra charges on online orders
బిర్యానీ బిల్లు, ఆన్​లైన్​ ఫుడ్​పై అదనపు ఛార్జీలు

By

Published : Jun 3, 2021, 10:37 AM IST

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి నిజామీ మటన్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం. లాక్‌డౌన్‌కు ముందు నచ్చిన సమయంలో అక్కడి రెస్టారెంట్‌కు వెళ్లి తినేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బిర్యానీ ధర చూసి అవాక్కయ్యాడు. ఎప్పుడూ హోటల్‌కు వెళ్తే రూ.265కి వచ్చే బిర్యానీ ఆన్‌లైన్‌లో రూ.405 చూపిస్తోంది. దానికి డెలివరీ పార్ట్‌నర్‌ రుసుము కింద రూ.22, పన్నులు, ఛార్జీల కింద రూ.40.25 (రెస్టారెంట్‌ ప్యాకేజింగ్‌ రూ.19.05, జీఎస్టీ రూ.21.20) మొత్తం బిల్లు రూ.467 అయ్యింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే ఆయన అదనంగా రూ.202 చెల్లించాల్సి వస్తోంది. బేగంపేట్‌కు చెందిన మరో వ్యక్తి ఆన్‌లైన్‌లో చీజ్‌ గ్రిల్‌ బర్గర్‌తో పాటు 90గ్రాముల ఆలూచిప్స్‌ ఆర్డర్‌ పెట్టారు. దాని ఎమ్మార్పీ ధర రూ.35 అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టడంతో రూ.70 వసూలు చేశారు. దానికి ప్యాకేజింగ్‌ ఛార్జీలు, టాక్స్‌లు అదనంగా వసూలు చేశారంటూ వాపోయాడు.

సమాచార హక్కు ద్వారా ప్రశ్నించా

అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన నియమ నిబంధనలు, నియంత్రణ లేకపోవడంతో వినియోగదారుల నుంచి దండుకోవడం ఇష్టారాజ్యంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించలేదు. ఈ విషయమై సమాచార హక్కు ద్వారా ప్రశ్నించా. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ దృష్టికి విషయం తీసుకెళ్లా. కానీ ఇంత వరకు స్పందన రాలేదు.

-విజయ్‌గోపాల్, సామాజిక కార్యకర్త

ఫిర్యాదు చేసి పరిహారం పొందొచ్చు

నేరుగా, ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వ్యత్యాసంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారులు ఏ మాత్రం ఉపేక్షించకుండా వినియోగదారుల మండలి లేదా తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఓ ఆర్డర్‌పై ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ ధరలు వసూలు చేయడం, డెలివరీ ఛార్జీ వేయడం వినియోగదారుడిని మోసం చేయడమే. దానికి రెస్టారెంట్లు బాధ్యత వహించాలి.

-జవహర్‌బాబు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌-2 సభ్యుడు

ABOUT THE AUTHOR

...view details