cooking oils : ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు నిల్వలపై విధించిన ఆంక్షలను కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూనెలు, నూనె గింజల నిల్వలపై ఆంక్షలు విధిస్తూ గడిచిన ఏడాది జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ నెల 31తో ముగియనుంది.
వంట నూనెలు, గింజల నిల్వలపై ఆంక్షల పొడిగింపు - వంట నూనెలపై ఆంక్షలు పొడిగింపు
వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు నిల్వలపై విధించిన ఆంక్షలను కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. పౌరసరఫరాల సంస్థ కమిషనర్ అనిల్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
చిల్లర వర్తకులు వంద క్వింటాళ్లు మాత్రమే..
పది లక్షలు అంతకు మించి జనాభా ఉన్న జిల్లాల్లో వంట నూనెను టోకు(హోల్‌సేల్) వ్యాపారులు 900 క్వింటాళ్లు, చిల్లర(రీటైల్) వర్తకులు వంద క్వింటాళ్లు మాత్రమే నిల్వ చేయాలి. ఆ జిల్లాల్లో నూనెగింజలను టోకు వ్యాపారులు 2,250 క్వింటాళ్లు, చిల్లర వ్యాపారులు 150 క్వింటాళ్లు మాత్రమే నిల్వ చేయాలని స్పష్టం చేసింది. 3-10 లక్షల మంది జనాభా ఉన్న జిల్లాల్లో వంట నూనెను టోకు, చిల్లర వ్యాపారులు 600, 50 క్వింటాళ్ల చొప్పున, నూనె గింజలను 1,500, 113 క్వింటాళ్లను మాత్రమే నిల్వ చేయాలి. మూడు లక్షల లోపు జనాభా ఉన్న జిల్లాల్లో వంట నూనెలను టోకు వర్తకులు 375 క్వింటాళ్లు, చిల్లర వ్యాపారులు 30 క్వింటాళ్లు, నూనె గింజలను టోకు వ్యాపారులు 1,200 క్వింటాళ్లు, చిల్లర వర్తకులు 75 క్వింటాళ్లు మాత్రమే నిల్వ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.