రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు - తెలంగాణ తాజా వార్తలు
18:14 May 07
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. అటు జనాలు గుమిగూడడంపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కోవిడ్ కేసుల పెరుగుదల, హైకోర్టు సూచనల మేరకు ఆంక్షలు అమలు చేయనుంది.
పెళ్లిళ్లకు వంద మందికి హాజరు కారాదని... కొవిడ్ మార్గదర్శకాలు, భౌతికదూరాన్ని పాటించడంతో పాటు మాస్కులు విధిగా ధరించాలని స్పష్టం చేసింది. అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని తెలిపింది. అక్కడ కూడా కొవిడ్ మార్గదర్శకాలు, భౌతికదూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదపరమైన, విద్య, మతపరమైన, సాంస్కృతిక పరమైన సమావేశాలు, ర్యాలీలను పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్... ఆదేశాలు, ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు.
ఇవీ చూడండి:అత్యవసర కేసుల విచారణకు సీజేఐ మార్గదర్శకాలు