రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకారవేతనాల దరఖాస్తు గడువు నేటితో ముగుస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తికానందున గడువు పెంచింది. ఈ నిర్ణయంతో సుమారు 5.11 లక్షల విద్యార్థులకు మేలు జరగనుంది.
ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంపు - telangana student scholarships and tuition fees news
16:45 February 15
ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంపు
కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. ప్రవేశాలు ముగిసినా యూనివర్సిటీలు, సెట్ కన్వీనర్ల నుంచి విద్యార్థుల సమాచారం.. సంక్షేమ శాఖలకు చేరలేదు. ఫలితంగా ఈ ఏడాదిలో కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇప్పటికి 2 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు దాదాపు 13 లక్షల మంది బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటికి కేవలం 8.8 లక్షల దరఖాస్తులే చేరాయి. బోధన రుసుములు పొందేందుకు అర్హత కలిగిన కళాశాలలు 5,117 ఉంటే, 3,059 మాత్రం ఈ-పాస్‌లో గుర్తింపు వివరాలు నమోదు చేశాయి. మిగతావి ఆ పని చేయకపోవడం వల్ల విద్యార్థులకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.