తెలంగాణ

telangana

ETV Bharat / city

మనసెరిగి.. మనువాడటం మేలు - నచ్చిన వాళ్లని పెళ్లాడటం మేలు

అనకాపల్లిలో ఒక యువతి.. కాబోయే భర్త గొంతు కోసింది. పెళ్లి ఇష్టం లేక.. దాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. హనుమకొండలో పెళ్లయిన నెల రోజులకే భర్త రాజు గొంతును బ్లేడుతో కోసింది భార్య అర్చన. నచ్చని మనువు చేసిన పెద్దలపై కోపాన్ని ఇలా తీర్చుకుందని పోలీసులు నిర్ధారించారు. పచ్చని తోరణాలు వాడిపోకముందే.. వధువో, వరుడో ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవల చూశాం. ఇష్టం లేని పెళ్లిళ్లే ఈ అఘాయిత్యాలకు ప్రాథమిక కారణమని తెలుస్తోంది. అటు పెద్దలు, ఇటు వధూవరులు తాము అనుకున్నదే జరగాలన్న పంతంతో  వ్యవహరించడం వీటికి దారితీస్తోందని విశ్లేషిస్తున్నారు మానసిక నిపుణులు.

marriages fail
marriages fail

By

Published : Jun 7, 2022, 10:39 AM IST

పోటీ ప్రపంచంలో యువతీ, యువకులు కెరీర్‌కే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. వైవాహిక జీవితంపై ఎన్నో అంచనాలు వేసుకుంటున్నారు. కొంతమంది విద్యాభ్యాసంలో తమ సహాధ్యాయులను, ఉద్యోగంలో తోటి ఉద్యోగులను జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటున్నారు. పెద్దలు సమ్మతించకపోయినా, వారిని వ్యతిరేకించి పెళ్లి చేసుకునేవారు కొందరైతే.. ఎటూ తేల్చుకోలేక మానసిక సంఘర్షణతో అర్ధంతరంగా తనువు చాలించేవారు మరికొందరు.

చదువు విషయంలో కఠినంగా ఉండే కొందరు తల్లిదండ్రులు సైతం వివాహం విషయంలో పిల్లల ఇష్టాల మేరకు నడుచుకుంటున్నారని ఎస్‌కేడీ మ్యారేజ్‌బ్యూరో నిర్వాహకులు లావేటి సత్యనారాయణ తెలిపారు. కొందరు పిల్లలు అతి స్వేచ్ఛనివ్వడంతో తప్పటడుగులు వేస్తున్న సంఘటనలూ ఉంటున్నాయని చెప్పారు. ఎక్కువమంది తల్లిదండ్రులు తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటున్నారని.. తమను కాదంటే ఆత్మహత్య చేసుకుంటామని, ఆస్తిలో భాగం ఇవ్వబోమని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ఇలాంటి ధోరణి వల్ల సమస్యలు జటిలమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, పెద్దలు కూర్చుని భవిష్యత్తుకు సంబంధించిన సాధకబాధకాల బేరీజుతో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇద్దరూ పట్టుదలకు పోవడం శ్రేయస్కరం కాదని సలహా ఇస్తున్నారు.

సామాజిక భయం:బిడ్డల ఇష్టానికి ఆమోదం తెలిపే విషయంలో తల్లిదండ్రులు సమాజానికి భయపడి వెనుకడుగు వేస్తున్నారు. కుల, మతాంతర వివాహాలను అంగీకరిస్తే బంధువులు, సమాజంలో చులకనైపోతామన్న భయం కూడా మరో కారణమని మనస్తత్వ నిపుణురాలు డాక్టర్‌ అనిత అరే విశ్లేషించారు. పెరుగుతున్న విడాకులు, విఫలమవుతున్న ప్రేమపెళ్లిళ్లు కన్నవారిని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అనుభవరాహిత్యం వల్ల భాగస్వాముల ఎంపికలో పిల్లల నిర్ణయాలు ఫలించవని కొందరు పెద్దల భావన. తాము ఎంపిక చేసిన వారిని పెళ్లి చేసుకుంటే.. సాఫీగా సంసారం సాగిస్తారని వారి అంచనా.

పెద్దల మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకొనే వారిలో 5-10 శాతం మంది విడిపోవాలనుకుంటున్నారని షీ టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత తెలిపారు. విడాకులకు సిద్ధపడేవారిలో ఏళ్ల తరబడి ప్రేమించుకుని పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వివరించారు. భాగస్వామి నచ్చక.. పెళ్లికి ముందో, తర్వాతో ఆ విషయం పెద్దలకు చెప్పలేక.. కుమిలిపోయేవారే ఎక్కువ శాతం ఆత్మహత్యలకు పాల్పడతారని మనస్తత్వ విశ్లేషకుడు డాక్టర్‌ రాంచందర్‌ మోతుకూరి తెలిపారు. కొత్తవ్యక్తితో కాపురం, సన్నిహితులందరినీ విడిచి దూరంగా ఉండాల్సి రావడం వంటి చిన్న విషయాలకు కూడా తీవ్ర ఆందోళన చెందే వధువులూ ఉంటారని ఒక మనస్తత్వ నిపుణుడు చెప్పారు. అనునయంతో సరైన కారణాలు తెలుసుకుని పరిష్కరించాలని ఆయన వివరించారు.

తల్లిదండ్రుల్లో చాలా మార్పు : 'గతంతో పోల్చితే చాలామంది తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. వివాహం విషయంలో బిడ్డల ఇష్టానికి తగినట్టుగానే నడుచుకుంటున్నారు. ఏవైనా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేసినప్పుడు మాత్రమే వద్దని వారిస్తున్నారు. కన్నవారు తీసుకునే నిర్ణయాల వెనుక కారణాలను యువత అర్థం చేసుకోవాలి. ఏదైనా అనుకోని కష్టం ఎదురైనప్పుడు తల్లిదండ్రులు అండగా నిలిచేలా వారు నిర్ణయాలు తీసుకోవాలి.' -- - అనసూయ, షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి, సైబరాబాద్‌

పంతం పట్టకూడదు : 'కళ్లెదుట జరుగుతున్న కొన్ని సంఘటనలను ప్రామాణికంగా తీసుకోకూడదు. పిల్లల ఇష్టానికి అనుగుణంగానే కన్నవారు నడుచుకుంటున్నారు. పరిణతి లేకుండా తీసుకునే బిడ్డల నిర్ణయాలను తల్లిదండ్రులు సమర్థించలేరు. తప్పొప్పులను గుర్తించి సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తారు. నూరేళ్లు కలిసి నడవాల్సిన జీవిత భాగస్వామి ఎంపికలో కన్నవారి ప్రమేయం అవసరం. అదే సమయంలో బిడ్డల మనసును తెలుసుకోవటం పెద్దల బాధ్యత. ఇద్దరి మధ్య సమన్వయం, మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వాతావరణం ఉన్నప్పుడు ఎటువంటి సమస్యా తలెత్తదు.' -- డాక్టర్‌ మమతా రఘువీర్‌, భరోసా కేంద్రం సమన్వయకర్త

ABOUT THE AUTHOR

...view details