తెలంగాణ

telangana

ETV Bharat / city

అమ్మాయిలూ ఆపద ఉన్నట్లు అనిపిస్తే... తక్షణమే ఇలా చేయండి.. - అమ్మాయిలూ అపరిచితులతో జాగ్రత్త

Hyderabad Gang Rape: ఇంట్లో వాళ్లనే నమ్మలేని రోజులివి. అలాంటిది ముక్కూ మొహం తెలియని వ్యక్తులతో స్నేహం, వారు చెప్పే మాయ మాటలు నమ్మితే.. అది ఎంతటి ఘోరానికైనా దారి తీయచ్చు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేసింది. ఓ మైనర్‌ బాలికను స్నేహం ముసుగులో ముగ్గులోకి దింపిన ఐదుగురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా అపరిచితులతో స్నేహం చేసే క్రమంలో నిపుణులు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

Hyderabad Gang Rape
అమ్మాయిలూ.. అపరిచితులతో జాగ్రత్త

By

Published : Jun 5, 2022, 8:51 AM IST

Hyderabad Gang Rape: మైనర్లు, యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వావివరుసలు లేకుండా కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్‌ బాలికను స్నేహం ముసుగులో ముగ్గులోకి దింపిన ఐదుగురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఏళ్లు గడుస్తోన్నా నేటికీ అమ్మాయిల భద్రత గాల్లో దీపంలాగే ఉందనడానికి ఇది తాజా ఉదాహరణ. ఇలాంటి కలియుగ దుర్యోధన, దుశ్శాసనులున్న ఈ సమాజంలో ఆడపిల్లలు సురక్షితంగా మనగలగాలంటే స్వయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా అపరిచితులతో స్నేహం చేసే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

స్నేహం పేరుతో వల!..

జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఇటీవలే ఒక బృందం మద్యం రహిత వేడుకను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వారిలో 80 శాతం మంది మైనర్లే. ఈ పార్టీకి ఓ బాలిక కూడా హాజరైంది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ వేడుకలో ఐదుగురు అబ్బాయిలు ఈ బాలికతో స్నేహం పెంచుకున్నారు. పార్టీ ముగిశాక.. ఇంటి వద్ద దిగబెడతామని వారు అనడంతో.. వారి మాయ మాటలు నమ్మిందా బాలిక. దీంతో ఆమెను కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో షాక్‌లో ఉండిపోయిన ఆ బాలిక ఒంటిపై గాయాలు చూసిన ఆమె తండ్రి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆపై తన మీద జరిగిన సామూహిక అత్యాచారం గురించి బాలిక వాంగ్మూలం ఇవ్వడంతో.. ఈ ఘటన రాజధానిలోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పట్టపగలే అమ్మాయిల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చిన ఈ ఘటన.. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇవి గుర్తుంచుకోండి...

‘ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం..’ అన్నారు గాంధీజీ. కానీ నేటి సమాజంలో పట్టపగలే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల మాయ మాటలు నమ్మి ఎంతోమంది అమ్మాయిలు/మహిళలు మోసపోతున్నారు. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే తెలియని వ్యక్తులతో ముప్పు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

❉ కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఈ క్రమంలో మీ వ్యక్తిగత విషయాలు, ఫోన్‌ నంబర్‌.. వంటివేవీ వాళ్లతో పంచుకోకూడదు.

❉ అపరిచిత వ్యక్తుల ఆహ్వానం మేరకు పార్టీలు, పబ్బులు, ఇతర వేడుకలకు వెళ్లకపోవడమే ఉత్తమం. వాళ్లు ఇదే అదనుగా భావించి.. మీతో మరింత స్నేహంగా నటించే అవకాశం ఉంది. ‘కీడెంచి మేలెంచమన్నారు’ పెద్దలు. కాబట్టి ఇదంతా మిమ్మల్ని వలలో పడేయడానికేనేమో అని అనుమానించడంలోనూ తప్పు లేదంటున్నారు నిపుణులు.

❉ కొత్తగా పరిచయం అయి.. మీకు బాగా నమ్మకంగా అనిపించినా సరే.. వాళ్లని సాధ్యమైనంతవరకు ఒంటరిగా కలవకూడదు. వారితో ఒంటరిగా వెళ్లకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం మీ వెంట మీ సోదరుడు, బాగా కావాల్సిన వ్యక్తి/మీకు బాగా నమ్మకముండే వ్యక్తిని వెంట తీసుకెళ్లండి. అనుకోని ప్రమాదం ఎదురైతే వాళ్లు మీకు రక్షణ కవచంలా మారచ్చు.

❉ మీరు ఒంటరిగానైనా, లేదంటే ఎవరినైనా తోడు తీసుకెళ్లినా సరే.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా.. ఇంట్లో వాళ్లకు, దగ్గరి స్నేహితులకు తెలియజేయడం మంచిది. ఈ క్రమంలో మీరెక్కడున్నారో వాళ్లకు తెలియడానికి వీలుగా మీ మొబైల్‌లో ‘జీపీఎస్‌ ట్రాకర్‌ యాప్‌’ను వినియోగించచ్చు.. అలాగే అవతలి వారి ఫోన్‌లోనూ ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయి ఉండాలి.

❉ ఒకవేళ కారు/బైక్‌పై వెళ్తున్నట్లయితే.. ఆయా వాహనాల్లో అమర్చుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటినీ ఉపయోగించుకోవచ్చు.

❉ మొబైల్‌లో ఎప్పుడూ ఫుల్‌ ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల నంబర్లు.. ఎమర్జెన్సీ లిస్ట్‌లో పెట్టుకోవడం తప్పనిసరి.

❉ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులను కలవాల్సి వచ్చినప్పుడు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి మీరు ఫోన్‌ చేసి.. రహస్యంగా వారిని లైన్‌లో ఉండమని చెప్పండి. మీరు అక్కడ్నుంచి బయల్దేరి ఇంటికి చేరే వరకూ ఈ కాల్‌ని ఇలాగే కొనసాగించడం మంచిది. ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితి ఎదురైనా అవతలి వారు వెంటనే స్పందించి మీకు పొంచి ఉన్న ప్రమాదం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలుంటాయి.

❉ అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణగా ఉండేందుకు ఆయా ప్రభుత్వాలు కొన్ని యాప్స్‌ని కూడా రూపొందించాయి. తెలంగాణ పోలీసులు రూపొందించిన HAWK EYE, కేంద్ర హోంశాఖకు చెందిన 112 యాప్‌, ఏపీ పోలీసు శాఖ వారి ‘ఏపీ పోలీస్‌ సేవా’, ‘దిశ’.. వంటి యాప్‌లతో పాటు ఇతర రక్షణ యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో యాప్‌ ఓపెన్‌ చేసి ఒక్క బటన్‌ నొక్కగానే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కి ఫిర్యాదు అందుతుంది. దాంతో వెంటనే వారు మిమ్మల్ని రక్షించే ఆస్కారం ఉంటుంది.

❉ అయితే అన్ని వేళల్లో, సందర్భాల్లో.. ఇతరుల సహాయం కోసం ఎదురుచూసే సమయం ఉండచ్చు.. ఉండకపోవచ్చు. అందుకే అమ్మాయిలకు స్వీయ రక్షణ విద్యలు అవసరం అంటున్నారు నిపుణులు. వీటితో పాటు చిన్న కత్తి, పెప్పర్‌ స్ప్రే.. వంటివీ చేతికి అందుబాటులో ఉంచుకోవాలి.

❉ మహిళల స్వీయ రక్షణకు ప్రస్తుతం వివిధ రకాల గ్యాడ్జెట్లు కూడా అందుబాటులోకొచ్చాయి. మనపై దాడి చేయబోయే వారికి షాక్‌ ఎఫెక్ట్‌నిచ్చే టార్చ్‌ లైట్‌, సేఫ్టీ రాడ్‌, జీపీఎస్‌తో పనిచేసే పెండెంట్‌, వాచీగా మణికట్టుపై ఒదిగిపోయే సేఫ్‌లెట్‌.. వంటివన్నీ ఆపద సమయాల్లో మనల్ని రక్షిస్తాయి. కాబట్టి వీటి పనితీరు తెలుసుకుంటే సులభంగా ఉపయోగించచ్చు.

ఇవీ చదవండి:వినోదం మాటున విశృంఖలత్వం... పట్టించుకోని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలు...

ABOUT THE AUTHOR

...view details