తెలంగాణ

telangana

ETV Bharat / city

'బ్రా’ వేసుకోవడం మంచిదా..? కాదా..? ఈ స్టోరీ చదవండి... - Experts About Benifits With Wearing Bra

చక్కటి ఎద సౌష్టవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం సర్వ సాధారణమే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్‌ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్‌, బ్రాలెట్‌, స్పోర్ట్స్‌ బ్రా వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే..‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అని అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప... మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు నిపుణులు. బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

Experts About Benifits With Wearing Bra
‘బ్రా’ వేసుకోవడం మంచిదా? కాదా?

By

Published : Jul 2, 2020, 5:44 PM IST

వక్షోజాలను పట్టి ఉంచే బ్రా వేసుకున్నంత సేపూ ఏదో బంధించి ఉంచినట్లనిపిస్తుందని చాలామంది మహిళలు పలు సర్వేల్లో వెల్లడించారు. బ్రా తొలగించాక ఎంతో హాయిగా ఫీలవడం చాలామందికి అనుభవమే. అయితే కొందరికి అసౌకర్యంగా ఉన్నా అయిష్టంగానే వీటిని ధరిస్తుంటారు. కానీ ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఒకవేళ అంతలా ధరించాలనుకుంటే కాస్త వదులుగా ఉండే బ్రాను ఎంచుకోవడం, లేదంటే వదులుగా ఉండే ఇతర లోదుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నా మంచిదేనంటున్నారు. అవసరం లేనప్పుడు బ్రా ధరించకపోవడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలేంటంటే..

రక్తప్రసరణ సాఫీగా..!

ఎప్పుడైనా కాస్త బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంటుంది. ఎక్కడైతే బాగా బిగుతుగా ఉందో ఆ శరీర అవయవానికి రక్తప్రసరణ కూడా సరిగ్గా జరగదు. బ్రా కూడా అలాంటిదే. వక్షోజాలను పట్టి ఉంచే ఈ ఇన్నర్‌వేర్...‌ మరీ బిగుతుగా ఉన్నట్లయితే ఛాతీ భాగానికి, రొమ్ములకు సరైన రక్తప్రసరణ జరగక ఛాతినొప్పి రావడం సహజమే. ముఖ్యంగా అండర్‌వేర్‌ తరహా బ్రాలు ధరించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బ్రా వేసుకోకపోతే ఆయా భాగాలకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మరీ కచ్చితంగా బ్రా ధరించాలనుకుంటే కాస్త వదులుగా, వక్షోజాలకు సౌకర్యవంతంగా ఉండే బ్రాను ఎంపిక చేసుకోవడం, లేదంటే ఇతర లోదుస్తులు వేసుకోవడం మంచిది.

ఇన్ఫెక్షన్లు రావొచ్చు..!

సీజన్ ఏదైనా కొందరికి పదే పదే చెమట పట్టేస్తుంటుంది. ఇలాంటి వారు శరీరానికి అతుక్కునేలా ఉండే బ్రా వంటి దుస్తులు ధరించడం వల్ల చర్మంపై అచ్చులు పడడం, ఆ ప్రదేశంలో ఎరుపెక్కడం, అలర్జీలు రావడం జరుగుతుంటాయి. అలాగే ప్యాడెడ్‌ బ్రాల వల్ల చనుమొనలు పొడిబారిపోయి.. సహజత్వాన్ని కోల్పోతాయంటున్నారు నిపుణులు. తద్వారా ఆ ప్రదేశంలో దురద రావడం, ఎరుపెక్కడం.. వంటివి జరుగుతుంటాయి. మరి, ఈ సమస్యలన్నీ రాకూడదంటే వదులుగా ఉండే బ్రాలను ఎంచుకోవడం, అత్యవసర సమయాల్లో మాత్రమే వాటిని ధరించడం.. ఉత్తమం అని సూచిస్తున్నారు.

హాయిగా నిద్ర పడుతుంది!

సాధారణంగా మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే దుస్తులు మార్చుకోవడం, కంఫర్టబుల్‌గా ఉండే నైట్‌వేర్‌, నైటీ లాంటివి వేసుకోవడం కామన్‌. ఎందుకంటే ఇవి వదులుగా ఉండి రాత్రుళ్లు పడుకునేటప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉంటాయి కాబట్టి. రాత్రి పడుకునేటప్పుడు బిగుతుగా ఉండే బ్రా వేసుకొని పడుకోవడం వల్ల అసౌకర్యంతో నిద్ర సరిగ్గా పట్టదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ ఇలాంటి బిగుతుగా ఉండే దుస్తులు, లోదుస్తులు వేసుకొని పడుకోవడం వల్ల క్రమంగా నిద్ర కరువై పలు అనారోగ్యాలు దరిచేరుతాయట. కాబట్టి రాత్రుళ్లు పడుకునేటప్పుడు బ్రా వేసుకోకుండా వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. హాయిగా నిద్ర పడుతుంది.

ఆ ముప్పు తక్కువ!

బాగా బిగుతుగా ఉండే బ్రా వల్ల రొమ్ముల్లో ఉండే కణజాలాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా రొమ్ము క్యాన్సర్‌కు కూడా దారితీయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్రా ధరించకపోతే ఈ క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కొంత వరకు తగ్గుతాయంటున్నారు. చాలామంది వక్షోజాల పరిమాణాన్ని బ్రాతో దాచేస్తుంటారు. అలాంటి వారికి రొమ్ము క్యాన్సర్​ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

వారికి ఉపశమనం..

సాధారణంగా ఆస్తమాతో బాధపడే వారు అప్పుడప్పుడూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారు బిగుతుగా ఉండే బ్రా వంటి లోదుస్తులు ధరించడం వల్ల డయాఫ్రమ్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి ఆస్తమా రోగులు బ్రా వేసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

ఇలాంటప్పుడు తప్పదు!

బ్రా ధరించకపోయినా నష్టమేమీ లేదని, పైగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని... కానీ పూర్తిగా దానికి స్వస్తి పలకడం కూడా సరి కాదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని అత్యవసర సమయాల్లో బ్రా తప్పనిసరి కావొచ్చంటున్నారు. ఉదాహరణకు.. వ్యాయామం చేసేటప్పుడు, క్రీడల్లో పాల్గొన్నప్పుడు వక్షోజాలకు సపోర్టివ్‌గా ఉండడానికి బ్రా ధరించడం తప్పనిసరి. లేదంటే రొమ్ముల కణజాలాలు దెబ్బ తిని నొప్పి రావడంతో పాటు అసౌకర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో స్పోర్ట్స్‌ బ్రా చక్కగా ఉపయోగపడుతుంది.

బయటకు వెళ్లినప్పుడు, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ చక్కటి శరీర సౌష్ఠవం కోసం లోదుస్తులు వేసుకోవడం చాలామందికి అలవాటే. అయితే అవి మరీ బిగుతైనవి కాకుండా వదులుగా ఉండేవి ఎంచుకున్నప్పుడే... ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా కంఫర్టబుల్‌గా ఉండొచ్చన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే బిగుతుగా ఉండే బ్రాలు ధరిస్తూ.. ఛాతిలో నొప్పి, నడుం నొప్పి, వెన్ను నొప్పి వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే... నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించడం, వదులుగా ఉండే బ్రాలు ధరించడం ఉత్తమం.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details