రాష్ట్రంలో పంటలకు కోతులు, అడవిపందుల బెడద తీవ్రంగా ఉంది. మొలకెత్తినప్పటి నుంచి పంట కోతకొచ్చే వరకు పంటలకు వాటి బాధ తప్పడం లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటే... మరికొన్ని చోట్ల అడవిపందుల బెడద తీవ్రంగా ఉంది. అడవిపందులు మనషులపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి బాధ నుంచి తప్పించుకునేందుకు రైతులు వివిధ రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ అవి ఫలితాలను ఇవ్వడం లేదు.
కాల్చి చంపినా తగ్గని సమస్య...
కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు వీలుగా అటవీప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని చాలా అటవీ ప్రాంతాల్లో పండ్లనిచ్చే చెట్లను నాటారు. అడవిపందులకు సంబంధించిన అంశం మాత్రం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటి నియంత్రణ కష్టసాధ్యంగా మారింది. అడవి పందులను కాల్చి చంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో లైసెన్స్డ్ షూటర్లకు అనుమతిచ్చింది. ఉమ్మడి మెదక్ సహా కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వాహనాల్లో తిరుగుతూ షూటర్లు అడవిపందులను కాల్చినా... సమస్య మాత్రం అలాగే ఉంది.