తెలంగాణ

telangana

ETV Bharat / city

వ్యాయామం మానకుండా ఉండాలంటే..?

వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయం తెలుసు. రోజూ వ్యాయామం చేయాలనీ తెలుసు. అయినా ఎందుకనో బద్ధకం. ‘అంతా బాగానే ఉంది కదా. ఈ రోజు చేయకపోతే ఏమవుతుందిలే. రేపు చూసుకుందాం.’ ఎప్పటికప్పుడు ఏవేవో సాకులు. ఎన్నెన్నో వాయిదాలు. మీరొక్కరే కాదు. చాలామంది చేసేది ఇదే. ముఖ్యంగా వ్యాయామాలు ఆరంభించిన తొలి మూడు, నాలుగు నెలల్లో ఇలాంటి ధోరణితోనే వ్యవహరిస్తుంటారు. కొత్త వ్యాయామాలు మొదలెట్టినప్పుడూ ఇలాగే ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాయమాన్ని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే అశంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం

exercise information news for etv bharat
వ్యాయామం మానకుండా ఉండాలంటే..?

By

Published : Mar 12, 2021, 11:42 AM IST

వ్యాయామాలు కొనసాగించటానికి దృఢ సంకల్పం అవసరం. ఎందుకంటే ఇదొక అలవాటుగా మారటానికి కొంత సమయం పడుతుంది. బరువు, బొజ్జ తగ్గుతుండటం, శ్వాస తేలికగా ఆడుతుండటం, మునుపటి కన్నా బలంగా ఉన్నట్టు అనిపించటం, గుండె ఆరోగ్యం మెరుగుపడుతున్న సూచనలు కనిపించటం వంటివి అనుభవంలోకి వస్తున్న కొద్దీ వ్యాయామ ప్రయోజనాలు అవగతమవుతూ వస్తుంటాయి. వ్యాయామాలు మానెయ్యకుండా కొనసాగించటం తేలికవుతుంది. విశ్వాసం పెరుగుతున్నకొద్దీ స్ఫూర్తి, ఆసక్తి ఇనుమడిస్తాయి. అప్పటివరకూ.. అంటే వ్యాయామం ఒక అలవాటుగా మారి, ఫలితాలు కనిపించటం మొదలయ్యేంత వరకు చిత్తశుద్ధితో కొనసాగించటం మంచిది. ఇందుకు కొన్ని ఉపాయాలు ఉపయోగపడతాయి.

ఎందుకు?’ అనేది గుర్తు తెచ్చుకోండి

ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో వ్యాయామాలు చేస్తుండొచ్చు. కొందరు బరువు తగ్గాలనుకోవచ్చు. కొందరు రక్తపోటు పెరగకుండా చూసుకోవాలనుకోవచ్చు. ఇంకొందరు గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల భయంతోనూ వాటిని నివారించుకోవటానికి వ్యాయామాలు కొనసాగిస్తుండొచ్చు. కారణమేదైనా గానీ దీర్ఘకాల లక్ష్యాలను ఒక కాగితం మీద రాసుకొని రోజూ కంటికి కనిపించేలా గోడకు అతికించుకోవటం మంచిది. వాటిని రోజూ గుర్తుకుతెచ్చేలా మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్‌లో రిమైండర్‌గానూ పెట్టుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు అప్రమత్తం కావటానికి ఉపయోగపడుతుంది.

ఫలితాలను చూసుకోండి

కొందరికి ఆరోగ్యం మెరుగుపడుతున్న సంకేతాలతో స్ఫూర్తి కలగొచ్చు. రక్తపోటు, గ్లూకోజు ఎంత మెరుగుపడింది? బరువు, బొజ్జ ఎంతవరకు తగ్గాయి? అనేవి మధ్యమధ్యలో చూసుకుంటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. వ్యాయామాలు మానెయ్యకుండా కొనసాగించటానికి వీలవుతుంది.

పోటీగా భావించండి

ఒక సవాలుగా తీసుకొని వ్యాయామాలు ఆరంభించినట్టయితే ఆయా లక్ష్యాలను సాధించటానికి మీకు మీరే పోటీ పెట్టుకోవచ్చు. లేదూ ఇతరులతో పోటీ పడొచ్చు. ఉదాహరణకు- ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ పరికరం కొనుక్కొని, రోజుకు 10వేల అడుగులు నడుస్తానని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం కొత్త ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ పరికరాలతోనైతే ఆన్‌లైన్‌లో ఇతరులతోనూ పోటీ పడొచ్చు. ఇలాంటి పోటీ భావన అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోవటానికి ఉపయోగపడుతుంది.

ఆటలతోనూ జతచేయండి

కొందరికి ఒంటరిగా వ్యాయామం చేయటం కన్నా నలుగురితో కలిసి ఆటలు ఆడుకోవటం ఇష్టంగా ఉండొచ్చు. దీంతోనూ వ్యాయామం కొనసాగించాలనే ఉత్సాహంగా కలగొచ్చు. అందువల్ల ఇరుగుపొరుగుతో బృందంగా ఏర్పడి ఆటలు ఆడుకోవచ్చు. వీలైతే స్పోర్ట్స్‌ క్లబ్‌లో సభ్యత్వం తీసుకోవచ్చు.

అడ్డంకులను తొలగించుకోండి

కొందరికి ఉదయం పూట వ్యాయామం చేయటం ఇష్టముండొచ్చు. కానీ పెందలాడే లేవటం కష్టం కావొచ్చు. కొందరికి సాయంత్రం వేళలో అనువుగా ఉండొచ్చు. అప్పటికి ఆఫీసు నుంచి ఇంటికి రావటం కుదరకపోవచ్చు. ఇంకొందరికి జిమ్‌లోనైతేనే వ్యాయామం చేయాలని అనిపించొచ్చు. కానీ జిమ్‌కు వెళ్లటం సాధ్యం కాకపోవచ్చు. వ్యాయామ లక్ష్యానికి ఇలాంటివేవైనా అడ్డుపడుతున్నట్టు గమనిస్తే వెంటనే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు- జిమ్‌కు వెళ్లటం కష్టమైనవాళ్లు డంబెల్స్‌, బిగుతు రబ్బరు బ్యాండ్ల వంటివి కొనుక్కొని ఇంట్లోనే వ్యాయామాలు చేయొచ్చు. మనసుంటే మార్గం దొరక్కపోదు.

బద్ధకం వదిలించుకోవాలి

మరింత వ్యాయామం చేయాల్సిన అవసరముందని డాక్టర్‌ చెప్పినప్పుడు కొందరు బెదిరిపోవచ్చు. డాక్టర్‌ సూచించిన మేరకు వ్యాయామాలు చేయలేమోనని, చేయలేకపోతున్నామని నిరుత్సాహానికి గురికావొచ్చు. దీంతో మొత్తానికే వ్యాయామం ఆపేస్తుంటారు. ఇది తగదు. నిజానికి ఇలాంటి సిఫారసులు సూచనలు మాత్రమేనని గుర్తించాలి. పూర్తిగా కాకపోయినా సాధ్యమైనంతవరకు ప్రయత్నమైతే చేయాల్సిందే. ఒకదగ్గర కూర్చోవటం కన్నా ఏదో ఒక రకంగా శరీరానికి శ్రమ కల్పించటం ప్రధానమని తెలుసుకోవాలి. ఉదాహరణకు- రోజుకు 10వేల అడుగులు నడవాలని డాక్టర్‌ చెప్పారనుకోండి. ఇది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాకపోవచ్చు గానీ గట్టిగా ప్రయత్నిస్తే రెండు, మూడు నెలల్లో కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే 30 నిమిషాల సేపు చేసిన వ్యాయామ ప్రభావాలన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అసలు ఏమాత్రం వ్యాయామం చేయకుండా టీవీల ముందో, కంప్యూటర్‌ ముందో కూర్చుంటే గుండె ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుందనీ హెచ్చరిస్తున్నాయి. రోజూ వ్యాయామం చేసేవారు సైతం ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే ఊబకాయం, మధుమేహం వంటి జబ్బుల ముప్పులు పొంచి ఉంటుండటం గమనార్హం. కాబట్టి బద్ధకాన్ని వదిలి ముందడుగు వేయటం ప్రధానమని గుర్తుంచుకోవాలి.


ఇదీ చదవండి:పంటలకు డ్రోన్​తో పురుగు మందుల పిచికారి

ABOUT THE AUTHOR

...view details