ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డితో ముఖాముఖి లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని గవర్నర్ అన్నారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సిలబస్‌ను పూర్తి చేయడానికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌కు తెలిపాం. అన్ని యూనివర్సిటీలు కూడా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు 75 నుంచి 80 శాతం సిలబస్ పూర్తయింది. మిగతా సిలబస్‌ను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నాము. ఇంటర్నెట్ స్పీడ్లేని ప్రాంతాల్లోని విద్యార్థులు పూర్తయిన సిలబస్‌ను చదువుకొండి. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత మిగతాది చెప్తాం. లాక్‌డౌన్‌కు ముందు ప్రవేశపరీక్షల షెడ్యూలు ఇచ్చాం. కానీ ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల వల్ల వాయిదా వేశాం. సాధారణ పరిస్థితుల తర్వాత మళ్లీ షెడ్యూలు ప్రకటిస్తాం.
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌కు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలు షెడ్యూలు ప్రకారం ఉంటాయా?
లాక్‌డౌన్, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే పరీక్షలు ఉంటాయి. అన్నింటికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్ ఇయర్ పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తాం. పరీక్షలు నిర్వహించి.. వెంటనే ఫలితాలు ఇస్తాం. విద్యార్థులు అందరు కూడా ఈ సమయాన్ని వృథా చేయకుండా ఆన్‌లైన్ తరగతులు వింటూ పరీక్షలకు సన్నద్ధమవండి. సాధ్యమైనంత వరకు విద్యాసంవత్సరం నష్టం కాకుండా చూస్తున్నాం. ఎలాంటి అవాంతరాలు లేకుంటే మే చివరి నాటికి పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రవేశ పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అవి ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం కాబట్టి ఫలితాలు వెంటనే వస్తాయి. జూన్ చివరి వారంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి.
కరోనాపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అలాంటి ప్రయత్నం ఏమైన చేస్తున్నాయా?
కరోనా వైరస్‌కు కారణాలు.. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్టడీ చేస్తున్నారు. వైరస్ ధోరణులపై హెల్త్ యూనివర్సిటీ.. న్యూట్రిషన్‌పై వ్యవసాయ యూనివర్సిటీ వాళ్లు పరిశోధనలు చేస్తున్నారు. అన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి.
ఇదీ చదవండి:ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా