FRIENDLY MEETING AT GUNTUR: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థ పరిధులేమిటో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. అందుకే చట్టసభల్లో మాట్లాడే భాష.. సభ్యత, సంస్కారంతో ఉండాలని స్పష్టం చేశారు.
రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటేనే ఇష్టం. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ముఖ్యులు. ఆయనతో పాటు చాలామందికి దక్కాల్సిన గుర్తింపు రాలేదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అలాంటి వారిని స్మరించుకోవటం గర్వకారణం. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉన్నత స్థాయికి వస్తారనే అభిప్రాయం తప్పని.. మాతృభాషలో చదివిన చాలా మంది దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు.ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలోనే మాట్లాడాలని, పరిపాలన కూడా తెలుగులో జరగాలి -వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి