Venkaiah Naidu on Azadi ka Amrit Mahotsav: చైతన్యశీలమై, వివక్షరహితమై, ప్రపంచానికే ఆదర్శమైన నవభారతం నిర్మించేందుకు భారతీయ యువత సమష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమ ప్రచారం పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌లో శిక్షణార్థులు, విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, ట్రస్ట్ నిర్వహణా సిబ్బంది, శిక్షణార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక, ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష వంటి సవాళ్లు అధిగమించే దిశగా సానుకూల మార్గంలో పోరాటం చేయాలని వెంకయ్య తెలిపారు. భారతదేశ అభివృద్ధిగాధలో యువత చురుగ్గా పాల్గొని స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకునే దిశగా కృషి చేయాలని కోరారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ముఖ్య ఘట్టాలు యువతకు గుర్తు చేసిన స్వరాజ్య అమృతోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ చొరవ దేశవ్యాప్తంగా జాతీయవాద స్ఫూర్తిని ఇనుమడింపజేసిందని తెలిపారు.
దేశాభివృద్ధికి ఆటంకంగా అక్కడక్కడ నెలకొన్న వివక్షలు, అవినీతి, పేదరికం అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య, అధికార, ప్రతిపక్షాల మధ్య సహకారం, సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో నైతికత, విలువల క్షీణత సమర్థవంతంగా అరికట్టాలని పౌరులకు సూచించారు. ఆరోగ్యకర జీవనశైలిపై దృష్టి పెట్టి నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యం పాడు చేసే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ యోగ లాంటివి జీవనంలో భాగం చేసుకుని ప్రకృతిని ప్రేమిస్తూ... ప్రకృతితో కలిసి జీవించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
"స్వరాజ్యం సాధించుకుని 75 ఏళ్ల మైలురాయిని ఉత్సవాలుగా నిర్వహించుకుంటున్న తరుణంలో ప్రపంచ యవనికపై భారతదేశ విజయాలను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడాలి. దేశాభివృద్ధిని చూసి నేను గర్విస్తున్నా. భారతదేశ రైతులు, సైనికులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధకులు, పారిశ్రామిక వేత్తలు, ఇంజినీర్లు, విద్యావేత్తలు వంటి అన్ని రంగాల ప్రజల విజయాల పట్ల మనం గర్వించాలి. ప్రపంచంలో అతిపెద్ద ప్రింట్, మీడియా నెట్‌వర్క్‌లో భాగంగా స్వేచ్ఛా, స్వతంత్ర మీడియాను కలిగి ఉండడం ఆనందదాయకం. కొవిడ్ మహమ్మారి సమయంలో అనేక సవాళ్లు అధిగమిస్తూ దేశం గర్వించే విధంగా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన రైతుల కృషి అభినందనీయం. రికార్డు సమయంలో వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడమే కాకుండా 90 పైగా దేశాలకు సరఫరా చేయటం, కొన్ని దేశాలకు ఉచితంగా అందించడం గర్వకారణం." - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
ఇవీ చూడండి: