VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON YCP CONGRESS: అధికారంలో ఉన్నంతవరకు అప్పులపై నెట్టుకొచ్చి.. ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయటమే వైకాపా ఉద్దేశంగా కనిపిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఏపీ సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదన్నారు. ఇప్పటివరకు చేసిన అప్పులు తీర్చడానికి.. మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇందుకోసం ఎఫ్ఆర్ఎంబీ (FRMB) చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం సరికాదని సూచించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే.. ప్రభుత్వానికి పేరు వస్తుందని సూచించారు. చంద్రబాబును అగౌరవంగా మాట్లాడుతుంటే.. సీఎం జగన్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకునేంత అవివేకం ఇంకోటి లేదన్నారు. అలాగే 3 రాజధానుల బిల్లు ఉపసంహరించి మళ్లీ పెడతాననడం ప్రభుత్వ వైఫల్యమేనని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.