ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ.. ఇతర కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తన స్వగ్రామంలో పురాతన దేవాలయాన్ని బాగు చేయించడం, ఎన్నికల ప్రచారంలో ద్విచక్ర వాహనంపై వెళ్లడం సహా పలు కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు వార్లల్లో ఉంటున్నారు.
ప్రస్తుతం రఘువీరాకు చెందిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. తాడుతో ఓ స్తంభానికి రఘువీరా కట్టేయబడి ఉన్నారు. అయినా.. తన ముఖంలో మాత్రం చిరునవ్వు, సంతృప్తి తొణికిసలాడుతోంది. ఇంతకీ.. ఆయన్ను ఎవరు కట్టేశారు. ఎందుకు కట్టేశారు...? ఈ ఫొటో వెనుక కథేంటీ..? అన్నదే ఇప్పుడు అసలు చర్చనీయాంశం.
ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని తన సొంతూరైన నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఉంటున్నారు. అక్కడే వ్యవసాయం చేస్తూ.. ఆనందంగా జీవిస్తున్నారు. తన మనవరాలు సమైరాతో ఆటలాడుతూ ఉత్సాహంగా.. గడుపుతున్నారు. తన మనవరాలితో.. మధురమైన క్షణాలు గడుపుతున్న ఆయన.. ఆటల్లో నిమగ్నమైన ఫొటోలు, వీడియోలను రఘువీరా ట్విట్టర్లో పంచుకున్నారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు.. ఆయన్ను సరదాగా తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
"తనతో ఆడుకునేందుకు తగినంత సమయం ఇవ్వట్లేదని.. నా మనవరాలు సమైరా నన్ను ఇలా తాడుతో స్తంభానికి కట్టేసింది. ఇంటి దగ్గరే ఉండి.. తనతో ఆడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది." అంటూ సరదగా తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఎంతో హృద్యంగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: