తెరాసలో చేరే విషయంపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు. దళిత బంధుకు గండి కొట్టే విధంగా కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కుటుంబానికి 10 లక్షల ఇస్తామని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ పథకాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాలని మోత్కుపల్లి కోరారు. దళిత బంధు పథకం అమలు కోసం రాజీనామా చేస్తానంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తక్షణమే ఆ పని చేయాలన్నారు.
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌పై మోత్కుపల్లి ఆరోపణలు చేశారు. మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని.. వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. 41 ఎకరాల దళితుల భూములు తన చేతిలో ఉన్నాయని.. స్వయంగా ఈటలే చెప్పారని.. మోత్కుపల్లి అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. దళితుల భూములు తిరిగి ఇవ్వాలన్నారు. ఈటల బంధువు దళితులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొందరు నేతలు, పార్టీలు దళిత బంధు పథకం అమలు నిలుపుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొదట్లోనే పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని.. రెండేళ్ల తర్వాత పథకం సరిగా అమలుకాకపోతే.. ప్రజలే తెరాసకు సరైన సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు.