Ex CM Rosaiah passed away : రోశయ్య. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు జిల్లా వేమూరులో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు 1933 జూలై 4న జన్మించారు. ప్రాథమిక విద్య అంతా గ్రామంలోనే సాగింది. తర్వాత 8వ తరగతికి చిన్న బసవయ్య కొలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరారు. చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించేవారు. గణితంపై పట్టు సాధించారు. పాఠశాలల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఎంతో చతురతతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరికీ సాయం అందించడంలో ముందుండే రోశయ్య.... తెలివైన విద్యార్థని ఆయనకు చదువు చెప్పిన గురువులు గుర్తుచేసుకున్నారు.
తెనాలిలో ఇంటర్ పూర్తి చేసిన రోశయ్య.... ఉన్నత విద్యకోసం గుంటూరు హిందూ కళాశాలలో చేశారు. అక్కడ కామర్స్ డిగ్రీ చదివారు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తితో అనతి కాలంలోనే విద్యార్థి సంఘ నాయకునిగా ఎదిగారు. రైతు నాయకునిగా పేరొందిన ఎన్జీ రంగా శిష్యరికంలో రాటుదేలారు. 1968లో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో 2 సార్లు ఆ పదవి చేపట్టారు. 1985లో తెనాలి ఎమ్మెల్యేగా, 2004లో ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఇలా రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన అతి కొద్దిమందిలో రోశయ్య ఒకరు. 1998లో నరసరావుపేట ఎంపీగా గెలిచారు. దిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేక ఆ తర్వాతి ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. 3 రకాల చట్టసభల్లో సభ్యునిగా పనిచేసిన అరుదైన నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే రోశయ్య వారి మంత్రివర్గంలో ఉండాల్సిందే. వేమూరు, తెనాలి, బాపట్ల, గుంటూరులో ఆయనకు ఎంతో మంది స్నేహితులు, బంధువులున్నారు. రోశయ్య మరణం వారిని తీవ్ర విషాదంలో ముంచింది.