గతంలో నమోదు చేసుకోని పట్టభద్రులే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలా? ప్రతి పట్టభద్రుడూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా?
ప్రస్తుతం ఎన్నికలు జరిగే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని ప్రతి పట్టభద్రుడూ ఇప్పుడు తన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆరేళ్ల కిందట జరిగిన మండలి ఎన్నికల సమయంలో ఓటు హక్కును నమోదు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ జాబితాను ఎన్నికల సంఘం కేవలం పరిశీలన, రికార్డుల కోసమే పరిగణనలోకి తీసుకుంటుంది. తాజాగా నమోదు చేసుకున్న అర్హులకు మాత్రమే ఓటు హక్కు లభిస్తుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీ కాలం 2021, మార్చి 29వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం ఓటర్ల జాబితాను తయారు చేసేందుకే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హతలు ఏమిటి?
డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అయితే, ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై మూడు సంవత్సరాలు పూర్తి అయిన వారు మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఓటు హక్కు నమోదు కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి? ఏయే పత్రాలు జత చేయాలి?
అక్టోబరు 1వ తేదీ నుంచి వ్యక్తిగతంగా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 11వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తాం. డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది జనవరి 18న ప్రకటిస్తాం. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని అధికారులు పోలింగు కేంద్రాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తారు. వారి వద్ద ఓటరు నమోదు దరఖాస్తులు ఉంటాయి. వాటిని భర్తీ చేసి ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల ప్రతులను జత చేయాలి. ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే వారు ceotelangana.nic.in లేదా www.nvsp.in ద్వారా ఫారం-18ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసం ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించాం. నవంబరు 11వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ వివిధ విభాగాల కింద 2,87,721 దరఖాస్తులు అందాయి. వాటిలో ఓటు నమోదు కోసం 1,31,171 దరఖాస్తులు వచ్చాయి.
సాధారణ ఎన్నికల ఓటర్ల నమోదులో ఇలాంటి నిబంధన లేదు కదా? మండలి ఎన్నికలకే ఎందుకు?
నిజమే. సాధారణ ఎన్నికల్లో ఇలాంటి నిబంధన లేదు. సాధారణంగా పట్టభద్రులు ఉద్యోగ రీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. ఇతరులు ఇక్కడికి వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మండలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నా తాజాగా ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం నిబంధన విధించింది.
ఇదీ చదవండి :ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కవిత... ఎన్నిక లాంఛనమే!