మునుగోడు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి ETVBHARAT interview with Komati Reddy Rajagopal Reddy: మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్‌కు జరుగుతున్న ధర్మయుద్ధమని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని, ప్రజల సమస్యలను చర్చించడానికి సీఎం అపాయిట్మెంట్ అడిగితే ఇవ్వలేదని తెలిపారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఎన్నిక.. ఈ గెలుపుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఈటీవీ ముఖాముఖిలో మాట్లాడారు.
విశేషాలు ఆయన మాటల్లోనే..
మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్ట్‌ల కోసమే నేను పార్టీ మారానని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. వారి దగ్గర ఆధారాలుంటే నిరూపించమనండి. నేను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే వారు రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాలు చేస్తున్నాను. ఆరోపణలకు ఆధారాలు చూపించకుంటే నేను వారిపై పరువునష్టం దావా వేస్తాను. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంతలాగా పాలిస్తున్న కేసీఆర్ దిగి రావాలంటే ఇక్కడ ఉపఎన్నిక రావాలి. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని నేను ఉపఎన్నికకు సిద్ధమయ్యాను. - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి
కేంద్ర నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా..కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణంతో పాటూ టెక్స్‌టైల్ పార్కును నిర్మిస్తానని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. 2018లో నాపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించినా ప్రతిపక్షంలో ఉండటం వల్ల నేను ఏం చేయలేకపోయానని చింతించారు. ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా సాయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని పేర్కొన్నారు. వేల కోట్లు అవినీతి సొమ్ముతో ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కౌరవసైన్యం మోహరించిందన్నారు. ప్రజలంతా ఇది గమనించి చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం సైతం మునుగోడు ప్రజలకు మద్దతివ్వాలని కోరుకున్నారు.
ఒకప్పుడు నియోజకవర్గంలో రైతులకు ఏం కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు వారు అడిగిందే తడువుగా అన్ని పనులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నా, యువతకు ఉపాధి కావాలన్న అప్పుల బారిన పడిన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు మద్దతివ్వాలి. పార్టీలకు అతీతంగా నాకు మద్దతిస్తేనే కేసీఆర్ అహంకారం తగ్గుతుంది. నేను వచ్చే ఎన్నికల్లోనూ మునుగోడు నుంచే పోటీ చేస్తాను. నా ఈ జీవితం మునుగోడు ప్రజలకు అంకితం. నా ఈ ప్రయాణం ఇక్కడి ప్రజలతోనే. - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి
ఇవీ చదవండి: