'స్థిరాస్తి రంగానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి' నిర్మాణరంగానికి ఇబ్బందులు
హైదరాబాద్‌లో భూములు తక్కువ ధరకు దొరుకుతాయి. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడకు వస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల నిర్మాణరంగం స్తంభించింది. 70 శాతం మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లారు. ఇప్పుడున్న కొద్దిమందితో 30 నుంచి 50 శాతం పనులే జరుగుతున్నాయి. కూలీ రేట్లు 50 శాతం పెరిగాయి. ప్రతి ప్రాజెక్టు బ్యాంకు రుణం తీసుకుని మొదలుపెట్టిందే. లాక్‌డౌన్ వల్ల పనులు ఆగి వడ్డీ భారం పెరిగింది. మారటోరియం వల్ల వడ్డీలపై వడ్డీలు పడుతున్నాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్ల ధరలు ఇంకా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌తో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ సాయమేమీ లేదు.
- జి.రాంరెడ్డి క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్, తెలంగాణ
'స్థిరాస్తి రంగానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి' ‘వర్క్ ఫ్రం హోం’ హైదరాబాద్‌కు అనుకూలం
వచ్చే సెప్టెంబరు నాటికి కొత్త ఇళ్లకు డిమాండు పెరుగుతుంది. ఐటీ రంగం ఎగుమతుల్లో రాష్ట్రం 17 శాతం వృద్ధి సాధించింది. వర్క్ ఫ్రం హోం విధానం కూడా హైదరాబాద్‌కు అనుకూలం. ఇతర నగరాలకన్నా ఇక్కడ ఇళ్ల ధరలు, అద్దెలు చాలా తక్కువ. వచ్చే అక్టోబరు తరువాత స్థిరాస్తి మార్కెట్ సాధారణ స్థాయికి వస్తుంది. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల నేరుగా లబ్ధి కనపడటం లేదు. దాంట్లో రియల్ ఎస్టేట్‌కు ఏమీ లేదు. ఇళ్ల రుణాలపై వడ్డీ శాతాన్ని 5 నుంచి 6కి తీసుకురావాలి. జీఎస్టీ రేటు తగ్గించాలి. మారటోరియం వల్ల వడ్డీపై వడ్డీ వేయవద్దని అడుగుతున్నాం. ఈఎంఐలు చెల్లించలేనివారికి వెసులుబాటు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలిస్తే బాగుంటుంది.
- చలపతిరావు, రాష్ట్ర స్థిరాస్తి రంగ డెవలపర్స్ సంఘం అధ్యక్షుడు
'స్థిరాస్తి రంగానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి' ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి
ఇప్పుడు ఇళ్లు కొనాలనుకునేవారు 1, 2 నెలలు వేచిచూసి ధరలు బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. లాక్‌డౌన్ సడలింపులు వచ్చాక కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఇది రియల్టర్లకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. స్థిరాస్తి మార్కెట్ 2 నుంచి 3 నెలల తరువాత సాధారణ స్థాయికి వస్తుందనుకుంటున్నాం. సిమెంటు బస్తా రూ.400కు చేరింది. సామగ్రి ధరలు 50 నుంచి 60 శాతం పెరగడం వల్ల ఇళ్ల ధరలు తగ్గించి అమ్మే అవకాశం లేదు. వర్క్ ఫ్రం హోం వల్ల డిజైన్ స్టేజ్‌లో ఉన్న ఇళ్లను అందుకనుగుణంగా మారుస్తున్నారు. దీనివల్ల ఫ్లాట్ విస్తీర్ణం పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం కొనసాగితే ఇలాంటి సదుపాయాలున్న ఇళ్లకు డిమాండు పెరుగుతుంది. అది లేకున్నా ఆ గదులు పిల్లలకు ఉపయోగపడతాయి.
- రామకృష్ణారావు, క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు
వలస కార్మికులకు నమ్మకం కల్పించాలి
తమకు ఏదో అవుతుందనే ఆందోళనతో వలస కార్మికులు వెళ్లిపోయారు. వారికి పని కల్పించే శక్తి వారి రాష్ట్రాలకు లేదు.వారు మన వ్యాపారంలో భాగం అనే నమ్మకం కలిగించాలి. వారికి ఇళ్ల సదుపాయాలు కల్పించాలి. దేశంలో ఎక్కడైనా రేషన్‌కార్డుపై సరకులు తీసుకునేలా చేయాలి. మెట్రో నగరాల్లో వలసకూలీల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు ఉండాలి. బస్, బోర్డింగ్ సదుపాయాలు కల్పించాలి. వారికి నమ్మకం ఏర్పడితే తిరిగి వస్తారు. గత మూడు నెలల్లో ఐటీ, ఫార్మా రంగాల్లో ఎవరికీ ఉద్యోగాలు పోలేదు. వ్యాపారం ఇంకా పెరుగుతుంది. వర్క్ ఫ్రం హోం చేస్తే 100 చదరపు అడుగులు ఒక ఉద్యోగికి అవసరం.అంటే భవిష్యత్తులో ప్రతి ఇంటిని అదనపు జాగా కావాలి. రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ నిబంధనల్లో మార్టిగేజ్ చేయాలనే క్లాజ్ అవసరం లేదు. మార్టిగేజ్ రిలీజ్ చేస్తే లిక్విడేషన్ వస్తుంది. నాలా, భవన రుసుం తగ్గించాలి. నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా 20 శాతం సాయం అదనపు పూచీకత్తు అడగకుండా ఇవ్వాలి. త్వరలో భూముల ధరలు తగ్గుతాయి. దానివల్ల భవిష్యత్తులో ఇళ్ల ధరలు తగ్గవచ్చు.
- జీవీరావు, తెలంగాణ రాష్ట్ర డెవలపర్స్ సంఘం అధ్యక్షుడు