తెలంగాణ

telangana

ETV Bharat / city

మితమే.. హితం.. ఇవి తినండి షుగర్ తగ్గించుకోండి - Diabetes control Diet plan

Diabetes control Diet : భారతీయులు తినే ఆహార పదార్థాల్లో 60 శాతానికి పైగా పిండి పదార్థాలుంటున్నట్లు ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. వీటిని 40 శాతం కంటే తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లను సగటున 12 శాతమే తీసుకుంటున్నారు. వీటిని కనీసం 40 శాతానికి పెంచుకోవాలి. కొవ్వు పదార్థాలను 20 శాతం వరకు స్వీకరించాలి. ఇలా రెండు నెలల పాటు ఆహారంలో సమతౌల్యతను పాటిస్తే.. శరీరం తదనుగుణంగా పనిచేస్తుంది.

Diabetes Food
మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన ఆహారం

By

Published : Sep 21, 2022, 12:55 PM IST

Updated : Sep 21, 2022, 1:04 PM IST

Diabetes control Diet: ఇష్టమైన ఆహారాలను చూడగానే.. అత్యధికుల్లో జిహ్వ చాపల్యం పెరుగుతుంది. అవి తింటే గానీ తృప్తి చెందరు. అలా అదుపుతప్పి ఏది పడితే అది తింటే ఆరోగ్యానికి చేటు అంటున్నారు వైద్యనిపుణులు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను అధికంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌ అపరిమితంగా పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. సమయానుసారంగా మితాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలని సూచిస్తున్నారు. చెన్నై అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ పీజీ సుందరరామన్‌. మధుమేహం రాకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మధుమేహ బాధితులు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? తదితర అంశాలను ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

Diabetes control Diet in telugu : మన శరీరానికి సాధారణంగా రెండు రకాల పోషకాలు అవసరం. ఒకటి సూక్ష్మ పోషకాలు. ఇవి తక్కువ మొత్తంలో సరిపోతాయి. రెండో రకం స్థూల పోషకాలు. పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌), మాంసకృత్తులు (ప్రోటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్‌) రెండో కోవలోకి వస్తాయి. పిండి పదార్థాలు తేలిగ్గా జీర్ణమై.. రక్తంలోకి గ్లూకోజును వేగంగా విడుదల చేస్తాయి. ఆహారం జీర్ణమై గ్లూకోజుగా మారుతుంది.. కణాల్లోకి వెళ్లి శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియ క్రమబద్ధంగా సాగాలంటే సాధారణ ఆరోగ్యవంతులు మూడు పూటలా ఆహారం తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అది కూడా నిర్ణీత వేళల్లో తినాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలు రోజూ ఒకే సమయానికి తీసుకోవాలి. రాత్రివేళ 7.30 గంటలకు ముందే తినడం ఆరోగ్యకరం. ఇలా సమయం పాటిస్తే గ్లూకోజు విడుదల నియంత్రణలో ఉంటుంది.

బాధితులు షుగర్​ చెక్​ చేసుకునే పద్ధతులు

ఇన్సులిన్‌ ఎందుకు పనిచేయదు..మనం తిన్న ఆహారం ద్వారా విడుదలైన గ్లూకోజును వీలైనంత త్వరగా కణాలకు పంపించాలి. ఆ పని చేసేది ఇన్సులిన్‌. పిండి పదార్థాలు ఎక్కువగా తింటే, గ్లూకోజు ఉత్పత్తి పెరిగిపోయి.. దాన్ని వేగంగా కణాల్లోకి పంపడానికి అధిక మోతాదులో ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది కూడా. తద్వారా రక్తంలోనే గ్లూకోజు ఎక్కువసేపు ఉండిపోతుంది. దీనివల్ల క్లోమగ్రంధిపై భారం పడి ఇన్సులిన్‌ ఉత్పత్తి మొరాయిస్తుంది. క్రమేణా ఇన్సులిన్‌ పనితీరు తగ్గిపోతుంది. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగిపోయి మధుమేహానికి దారితీస్తుంది. విటమిన్లు, ధాతువులు శరీరానికి కావాల్సిన రీతిలో అందక విటమిన్‌ బీ 12 లోపం తలెత్తుతుంది. అందుకే షుగర్‌ వ్యాధిగ్రస్థులు తాజా కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.

మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన ఆహారం

ముడిబియ్యంతో మేలు..పిండి పదార్థాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరానికి మంచివి కావు. పాలిష్‌ చేసిన బియ్యం, గోధుమలను తినడం వల్ల రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదలవుతుంది. ముడిబియ్యం, ముడి గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా గ్లూకోజు నెమ్మదిగా విడుదలవుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి మేలు.

మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన ఆహారం

మధుమేహులు రోజూ ఆరుసార్లు తినాలి..కణాల్లో జీవక్రియలన్నీ ప్రోటీన్ల సాయంతోనే జరుగుతాయి. కండరాలకు కావాల్సినవీ అవే. కండరాల్లోని కణాల్లోకి గ్లూకోజు చేరడానికీ ఇవే ఉపయోగపడతాయి. కండరాలు లేని కణాలకు గ్లూకోజును పంపించడానికి ఇన్సులిన్‌ అవసరమవుతుంది. రోజూ నడక మానొద్దు. నడవడం ద్వారా కండరాల శక్తిని పెంచుకోగలిగితే.. ఇన్సులిన్‌పై భారం తగ్గుతుంది. రక్తంలో షుగర్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ఎక్కువగా శ్రమించాలి. మితంగా తినాలి. ఇన్సులిన్‌ తీసుకునేవారైతే..రోజూ పరిమిత స్థాయిలో 3 సార్లు అల్పాహారం, 3 సార్లు భోజనం స్వీకరించాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి.

మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన ఆహారం

ఆహారాల్లో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి..

1.ఇన్సులిన్‌ సెన్సిటివిటీ.. అంటే మనం తిన్న ఆహారం క్లోమగ్రంథిలోని ఇన్సులిన్‌ బయటకు రావడానికి ప్రేరేపిస్తుందా? లేదా?

2. ఇన్సులిన్‌ సెక్రీషన్‌.. అంటే ప్రేరేపిస్తే ఎంత మోతాదులో ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంది?

3. గ్లూకోజ్‌ డిస్పోజల్‌ టైమ్‌.. అంటే రక్తంలో విడుదలైన గ్లూకోజ్‌ను ఎంత త్వరగా కణాల్లోకి పంపించగలుగుతుంది?

అందుకే అందరికీ ఒకే రకమైన ఆహారం ఉండదు. వ్యక్తిని బట్టి ఆహార పదార్థాల కూర్పును మార్చుకోవాలి. సమయం ఒక్కటే కానీ ఎంత తినాలి? ఏవి తినాలి? అనేది మాత్రం మారుతుంటుంది. ఇవన్నీ షుగర్‌ రాకుండా ముందు దశలో తీసుకునే జాగ్రత్తలు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 21, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details