Balapur Laddu Auction: భక్తుల పాలిట కొంగుబంగారమైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2020 మినహా 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాటలో ప్రత్యేకత చూపిస్తూ వస్తున్న ఉత్సవ సమితి.. ఈ ఏడాది ఘనంగా వేలంపాట నిర్వహించేందుకు సిద్ధమైంది. 1994లో 450 రూపాయలతో మొదలైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వందల, వేలు దాటి రికార్డుస్థాయిలో లక్షలు పలుకుతోంది. సుమారు 20మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. లడ్డూను దక్కించుకునేందుకు పడే పోటీ.. ఆద్యంతం రసవత్తరంగా ఉంటుంది.
వేలల్లోంచి లక్షల్లోకి: 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి లక్షా 5 వేల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి 4 లక్షల 15 వేలకు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. అప్పటివరకు ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర ఏకంగా 2 లక్షలు పెరిగింది. 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షల దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు లడ్డు దక్కించుకున్నారు. 2016లో నాలుగు లక్షలు పెరిగింది. ఆ సంవత్సరం మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
వరుసగా మూడేళ్లు స్థానికులకే: 2017లో నాగం తిరుపతిరెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూ పొందగా.. 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేలు పాడి బాలాపూర్ లడ్డూ కైవసం చేసుకున్నారు. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి.. ఆ లడ్డూను ముఖ్యమంత్రికి అందజేశారు. గతేడాది అట్టహాసంగా జరిగిన వేలంపాటలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ రామేశ్ యాదవ్.. నాదర్గుల్ కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18 లక్షల 90 వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది అదే స్థాయిలో మరో రెండు నుంచి మూడు లక్షలు అదనంగా పలకవచ్చని ఉత్సవ సమితి భావిస్తోంది.
గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతోపాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు కోటి 44 లక్షల 77 వేల రూపాయలను ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఉదయం 5 గంటలకు తుది పూజల అనంతరం గ్రామ ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట నిర్వహిస్తారు.