నిజానికి గర్భం ధరించినా ఇలా యాక్టివ్‌గా ఉండడమే మంచిందంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సహకరిస్తే గనుక డాక్టర్ సలహా మేరకు ప్రసవం సమీపించే దాకా తమ తమ పనుల్లో కొనసాగచ్చంటున్నారు. పైగా ఇలా తల్లి చురుగ్గా పనిచేయడం వల్ల అటు పుట్టబోయే బిడ్డ కూడా చురుగ్గా ఉంటాడట! అలాగని పని పైనే పూర్తి ధ్యాస పెడుతూ కాబోయే తల్లులు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదని, తమ తమ విధుల్లో కొనసాగే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
నిండు గర్భంతోనే వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే వారు, రోజువారీ కూలీ పనులు చేసుకునే మహిళల్ని మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా గర్భం ధరించినా తమ తమ విధుల్లో కొనసాగుతున్నారు. మీరూ వీరినే ఫాలో అవుతూ నెలలు నిండుతున్నా పని చేయాలనుకుంటున్నారా? అయితే అందుకోసం మీ ఆరోగ్య పరిస్థితిని ఓసారి వైద్యుల వద్ద చెక్ చేయించుకొని వారు సరేనంటే ముందుకెళ్లమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే..!
ఇవి పాటించాల్సిందే!
* కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని వృత్తుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే గర్భిణిగా ఇలా ఎక్కువ సేపు నిల్చున్నా/కూర్చున్నా ఇబ్బందే! కాబట్టి మీ పనిని బట్టి నిర్ణీత వ్యవధుల్లో నిలబడుతూ, కూర్చుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, విరామం తీసుకుంటూ ఉండాలి. తద్వారా శరీరంపై పని భారం పడకుండా జాగ్రత్తపడచ్చు.
* కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.
* ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కాస్త ఎక్కువ సమయం నిల్చోవాల్సి వచ్చినా.. రెండు కాళ్లను మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా ఉంచడం, అలాగే ఒక కాలిని ముందు మెట్టుపై లేదంటే ఒక చిన్న స్టూల్‌పై ఉంచేలా చూసుకోండి. తద్వారా మీ శరీర బరువు లోయర్ బ్యాక్‌పై పడకుండా ఉంటుంది.
* ఇక కూర్చున్నప్పుడు కూడా పాదాల్ని నేలకు ఆనించడం కాకుండా.. ఫుట్‌రెస్ట్ (చిన్న స్టూల్ లాంటిది)పై ఉంచే ఏర్పాటు చేసుకోండి. తద్వారా పాదాల్లో వాపు రాకుండా జాగ్రత్తపడచ్చు.
* పనిలో పడిపోయి భోజనం చేయడం మర్చిపోకూడదు. డాక్టర్ సూచన మేరకు సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మధ్యమధ్యలో తినడానికి పండ్ల ముక్కలు, నట్స్, సలాడ్స్.. వంటివి మంచి ప్రత్యా్మ్నాయాలు!
* మీ బరువును బట్టి తగినన్ని నీళ్లు తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడచ్చు.
* ఆహారపు కోరికల పేరుతో బయటి ఆహారం తినడం అస్సలు మంచిది కాదు.. పైగా కరోనా పొంచి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంటి ఆహారమే శ్రేయోదాయకం అంటున్నారు నిపుణులు.
* అలాగే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో గర్భిణులు బయటికి వెళ్లి పని చేస్తున్నప్పుడు మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం.. వంటివి తప్పనిసరి!
* ఇంటి నుంచి పనిచేసినా, ఆఫీసుకు వెళ్లినా మీపై అధిక పని ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో వేళకు పనులన్నీ పూర్తయ్యేలా ఉదయమే చక్కటి ప్రణాళిక వేసుకుంటే సాయంత్రానికల్లా పనులన్నీ చకచకా పూర్తవుతాయి. తిరిగి త్వరగా ఇంటికి చేరుకోవచ్చు.