తెలంగాణ

telangana

ETV Bharat / city

Food Poisoning: ఇలా చేస్తే ఫుడ్‌ పాయిజనింగ్‌ అవుతుందట! - ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు

బయటి నుంచి తెచ్చిన పండ్లు, కాయగూరలపై వ్యాధికారక క్రిములుంటాయని.. వాటిని ఇంటికి తీసుకురాగానే శుభ్రం చేస్తుంటాం. అయితే మనం ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోయినా వాటిలో సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయని, అది క్రమంగా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీస్తుందని చెబుతోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అందుకే పదార్థాల్ని నిల్వ చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అదెలాగో తెలియజేస్తూ ఇటీవల పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

etv bharat special on food poisoning
ఫుడ్ పాయిజనింగ్​పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

By

Published : Jun 26, 2021, 5:14 PM IST

Updated : Jun 26, 2021, 7:05 PM IST

సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వండిన ఆహార పదార్థాలను రోజంతా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినా ఏమీ కాదనుకుంటాం. కానీ అలాంటి పదార్థాలు మనకు తెలియకుండానే కలుషితమయ్యే ప్రమాదం ఉందంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ. ఆహారం విషమయం కావడానికి కొన్ని కారణాలను కూడా చెబుతోంది.

ఫుడ్‌ పాయిజన్‌కు కారణాలివే!

* వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాల్ని రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. అది కూడా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి.

* ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

* ఆహారం వండి వార్చే క్రమంలో సరైన పరిశుభ్రతా ప్రమాణాల్ని పాటించకపోయినా ఈ సమస్య తలెత్తుతుంది.

* పచ్చి మాంసంపై ఉండే ఈ-కొలి, ఇతర బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. కనుక వాటిని ఇతర కాయగూరలు, పండ్లతో కాకుండా విడిగా తీసుకురావాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

రుచికి బాగానే ఉన్నా.. కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి చెందిన ఇలాంటి కలుషితమైన ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్‌.. వంటి సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ఫుడ్‌ పాయిజనింగ్‌ కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

* ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

* వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

* వండే ముందు, తర్వాత కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

* పదార్థాల్ని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తినడమే మంచిది. తద్వారా వాటిపై ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడచ్చు.

* మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరల్ని ముందుగా ఉప్పు/పసుపు వేసిన నీటిలో కడగడం ఉత్తమం. అలాగే క్యాలీఫ్లవర్‌, బ్రకలీ వంటి వాటిని వండే ముందు ఉప్పు నీటిలో కాసేపు ఉడికించడం మరీ మంచిది.

ఇదీ చదవండి:Covaxin: సెప్టెంబర్​ నుంచి పిల్లలకు కొవాగ్జిన్​..!

Last Updated : Jun 26, 2021, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details