తెలంగాణ

telangana

ETV Bharat / city

Diamonds: వజ్రాలు.. ప్రయోగశాలలో తయారు! - ప్రయోగ శాలలో వజ్రాల తయారీ

వజ్రం... ఎంత కఠినమైనదో అంత అందమైనది. అందుకే అదంటే అందరికీ అంత మోజు. అలాగని ఇష్టమొచ్చినన్ని వజ్రాల నగలు కొనుక్కోగలమా అంటే- ఒక చిన్న నెక్లెస్‌కే లక్షలు పెట్టాలి. కాబట్టే వజ్రాలు డబ్బున్నోళ్ల నేస్తాలుగానే ఇన్నాళ్లూ చలామణీ అవుతున్నాయి. అయితే ఆ అభిప్రాయాన్ని ఇక మార్చుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు వజ్రాలను ప్రయోగశాలలో తయారుచేస్తున్నారు... సగం ధరకే అందుబాటులోకి తెస్తున్నారు..! ల్యాబ్‌లోనా... కృత్రిమ వజ్రాలా... అని పెదవి విరిచేయకండి, ఇవి అసలు వజ్రాలకన్నా పది రెట్లు మెరుగైనవి మరి..!

Manufacture of synthetic diamonds
ప్రయోగ శాలలో వజ్రాల తయారీ

By

Published : Jun 26, 2021, 9:50 AM IST

ర్యావరణానికి హాని చేస్తుందని ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తున్నాం. కాలుష్యానికి కారణమవుతున్న లెదర్‌కి ప్రత్యామ్నాయాలు కనిపెడుతున్నాం. ఆఖరికి గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించడానికి మాంసాన్ని కూడా లేబొరేటరీలో తయారుచేసుకుంటున్నాం.

అలాంటిది... కాసేపు ధరించి మురిసిపోవడానికి... నాకూ ఓ రవ్వల నెక్లెసుందని చెప్పుకోవడం కోసం... పర్యావరణాన్ని పణంగా పెట్టడమా- అని ప్రశ్నిస్తోంది ఈతరం. అనడమే కాదు, పర్యావరణానికి హాని చేయని కృత్రిమ వజ్రాలే మాకిష్టం- అంటూ కొనేస్తోంది కూడా. మరి ఈ కృత్రిమ వజ్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..?

ఒకప్పుడు చిలకలూరి పేటలో అచ్చం బంగారు నగల్లా కనిపించే నగలను తయారుచేసేవారు. ఆ తర్వాత బంగారు పూత పూసిన వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగలొచ్చాయి. వజ్రాల్లోనూ అలాగే తళుకు బెళుకుల రాళ్లు చాలానే వచ్చాయి. క్యూబిక్‌ జిర్కోనియా(సీజడ్స్‌ అనేదీ వీటినే) అనే రంగులేని కృత్రిమ రాళ్లనే అమెరికన్‌ డైమండ్స్‌ అంటారు. బరువు ఎక్కువ, ధర తక్కువ ఉండే వీటిని నగల్లో ఎక్కువగా వాడతారు. ఇంకా మొయిసనైట్‌, బ్లాక్‌ స్పైనెల్‌, సింథటిక్‌ గార్నెట్‌ లాంటి వాటితో కూడా కృత్రిమ వజ్రాలను తయారుచేస్తారు.

సాధారణంగా కృత్రిమ లేదా మనిషి తయారుచేసిన వాటిని ‘సింథటిక్‌’ అంటారు. సహజంగానే అవి ‘చౌక’ అన్న అభిప్రాయం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కృత్రిమ వజ్రాలు ఇవేవీ కాదు. గనుల్లో లభించే సహజమైన వాటికి అన్నివిధాలుగానూ దీటైనవీ నాణ్యమైనవీనూ..!

బంగారంలాగే వజ్రాలు కూడా భూగర్భంలో సహజంగా తయారవుతా యన్నది తెలిసిందే. అలాంటిది ఈ కృత్రిమ వజ్రాలు ఎక్కడినుంచి వచ్చాయీ, వజ్రాన్ని ప్రయోగశాలలో తయారుచేయాలన్న ఆలోచన అసలు ఎందుకొచ్చిందీ, ఎలా తయారుచేశారూ, దానివల్ల వచ్చే లాభాలేమిటీ... అంటే...

కోట్ల సంవత్సరాలు


‘డైమండ్‌’ అన్న గ్రీకు మాటకి విడదీయలేనిదని అర్థం. భూమి లోలోపలి పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద కర్బన అణువులు ఘనీభవించగా ఏర్పడేదే వజ్రం. ఈ అణువుల అమరిక వల్లే వజ్రానికి ఆ కాఠిన్యం వస్తుంది. భూగర్భంలో వజ్రం తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఉపరితలం నుంచి దాదాపు వంద మైళ్లకన్నా లోతున తయారైన వజ్రాలు భూమి పొరల్లోని శిలాద్రవంతో కలిసి ప్రయాణిస్తూ వాటంతటవే కాస్త పైకి వస్తాయి. అలా వచ్చినవే వజ్రాల గనుల వేటలో బయటపడతాయి. అప్పటికీ ఇంకా లోతుగానే ఉండే ఆ గనులను పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి తవ్వాలి. ముడి ఖనిజాన్ని వెలికి తీయాలి. దాన్ని మళ్లీ క్రషర్‌లతో చిన్న చిన్న ముక్కలుగా విడదీయాలి. అందులో నుంచి వజ్రాలను వేరు చేసి శుభ్రంచేయాలి. ఆనక వాటికి సానబెట్టి, పాలిష్‌ చేస్తేనే... వాడేందుకు సిద్ధమవుతాయి. గనిలోంచి వెలికితీసిన ఒక వజ్రం ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని మన నగలోకి రావాలంటే కనీసం పాతికేళ్లు పడుతుందట. అంటే- ఆ పాతికేళ్ల ప్రయాణంలో దానిమీద పెట్టిన ఖర్చంతా కలిసేసరికి వజ్రం ధర మామూలు ప్రజలకు అందనంతగా పెరిగిపోతోందన్నమాట.

సరే... ఇంత కష్టపడడానికి మనం తయారుగానే ఉన్నా కావాల్సినన్ని వజ్రాలను తవ్వి తీసుకోవడానికి ఆ గనులేమీ అక్షయపాత్రలు కావు. అందులో వజ్రాలు నిరంతరం తయారవవు. ఎప్పుడో వందలకోట్ల సంవత్సరాల క్రితం తయారైనవి కాబట్టి వాటిని తవ్వి తీసుకోగానే గనులు వట్టి పోతాయి. 1983 నుంచీ వజ్రాలను తీస్తున్న ఆస్ట్రేలియాలోని రియో టింటో గనిని ఆర్నెల్ల క్రితం మూసేశారు. 86 కోట్ల క్యారట్లకు పైగా వజ్రాలను ఇచ్చిన గని అది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వజ్రాలు ఉన్న దక్షిణాఫ్రికాలోని గనుల నుంచి ఏటా కోటీ 30లక్షల క్యారట్ల వజ్రాలను వెలికి తీస్తున్నారు. వీటిల్లోనూ కొన్ని అయిపోవచ్చాయట. అదీగాక ఇప్పటివరకూ ఉన్నవే తప్ప ఈ మధ్య కాలంలో కొత్తగా వజ్రాల గనులెక్కడా బయటపడలేదు. దాంతో 2030 నాటికి వజ్రాల ఉత్పత్తి ఆరుకోట్ల క్యారట్లకు పడిపోతుందనీ, మరోపక్క డిమాండు మాత్రం ఎన్నో రెట్లు ఎక్కువవుతుందనీ ఐదేళ్ల క్రితమే ఫ్రాస్ట్‌ అండ్‌ సలివాన్‌ నివేదిక ఇచ్చింది. ఈ పెరిగే డిమాండును తట్టుకోవాలంటే కృత్రిమ వజ్రాల వాడకం పెంచాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు నిపుణులు.

ఆలోచన ఇప్పటిది కాదు...


ప్రయోగశాలలో వజ్రాలను కృత్రిమంగా తయారుచేయాలన్న ఆలోచన ఈ మధ్య వచ్చింది కాదు. వజ్రం పూర్తిగా కర్బనంతో తయారైందని తెలిసినప్పటినుంచీ శాస్త్రవేత్తలకు వాతావరణంలో ఉన్న కర్బనంతో దాన్ని తయారుచేయాలన్న ఆలోచన మొదలై ఎవరికివాళ్లు ప్రయోగాలు చేశారు. అయితే అవేవీ సఫలం కాలేదు. ఎనభయ్యేళ్ల క్రితం జనరల్‌ ఎలక్ట్రిక్‌(జిఇ) కంపెనీ ఆ దిశగా పరిశోధన చేయడానికి ‘ప్రాజెక్ట్‌ డైమండ్‌’ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే రెండో ప్రపంచయుద్ధం రావడంతో ఆ పని వెనక్కిపోయింది. ఆ తర్వాత 1950వ దశకంలో జనరల్‌ ఎలక్ట్రిక్‌కే చెందిన ట్రేసీ హాల్‌ కృత్రిమ వజ్రాల తయారీ విధానాన్ని కనిపెట్టాడు. ఇతర దేశాల్లోనూ వేర్వేరు సంస్థలు బయటకు తెలియకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండేవి. అయితే కొత్తలో అవి తయారుచేసిన వజ్రాలు చాలా చిన్నగా వచ్చేవి. నాణ్యత కూడా బాగుండేది కాదు. దాంతో వాటిని పరిశ్రమల్లో వాడేవారు. కానీ తయారుచేయడం మాత్రం మానలేదు. అలా చేయగా చేయగా అనుభవానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడవడంతో నాణ్యమైన పెద్ద వజ్రాల తయారీ సులభమైంది. సహజంగా కోట్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియని ప్రయోగశాలలో కొన్ని వారాల్లో చేయగలగడం సాధ్యమైంది.

రెండు పద్ధతుల్లో...


భూగర్భంలో ఎలాగైతే అధిక ఉష్ణోగ్రతా, అధిక పీడనమూ కలిసి వజ్రాలను తయారుచేస్తాయో అచ్చం అదే వాతావరణాన్ని ప్రయోగశాలలో సృష్టించి కృత్రిమ వజ్రాలను తయారుచేస్తున్నారు. ఇందుకు రెండు పద్ధతులు వాడుకలో ఉన్నాయి. రెండిటిలోనూ సూక్ష్మ వజ్రాలను విత్తనంగా వాడతారు. పూర్తిగా అధిక ఒత్తిడీ, ఉష్ణోగ్రతలను వాడే విధానాన్ని ‘హై ప్రెజర్‌ హై టెంపరేచర్‌’ విధానం అంటారు. దీంట్లో వజ్రంపొడిని కరిగించిన గ్రాఫైట్‌ కార్బన్‌తో కలిపి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత దగ్గర తీవ్ర ఒత్తిడికి గురిచేసి స్ఫటికీకరణ చెందేలా చేస్తారు. కెమికల్‌ వెపర్‌ డిపోసిషన్‌(సీవీడీ) అనేది రెండోది. పలుచటి వజ్రాన్నొకదాన్ని విత్తనంగా ప్లాస్మా రియాక్టర్‌లో ఉంచుతారు. 800 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర కర్బన వాయువులను అధిక పీడనంతో లోపలికి జొప్పిస్తారు. వాటిలోని కర్బనమంతా ఆ వజ్రపు పొర చుట్టూ చేరి ముడివజ్రంలాగా గట్టిపడుతుంది. తర్వాత దాన్ని మామూలు వజ్రంలాగే కట్‌చేసి పాలిష్‌ చేస్తారు. చైనాలో మొదటి విధానాన్ని వాడుతుండగా మనదేశంలో ఈ రెండో విధానంలోనే వజ్రాలను తయారుచేస్తున్నారు. మొదటి విధానంలో అయితే ఇతర లోహాలను వాడటం వల్ల తయారయ్యే వజ్రానికి నూటికి నూరుశాతం శుద్ధత ఉండదు. రెండో విధానంలో తయారుచేసినవాటిలో నూటికి నూరుశాతం కర్బనమే ఉంటుంది. నైట్రోజన్‌ అసలు ఉండదు. దాంతో స్వచ్ఛతలో ఇవి సహజ వజ్రాలకన్నా మేలైనవిగా ఉంటున్నాయి. రసాయనపరంగా లోపలా, భౌతికంగా ఆకృతిలోనూ, కాంతిని వెదజల్లే లక్షణంలోనూ ఈ కృత్రిమ వజ్రాలు సహజ వజ్రాలకు ఏమాత్రం తీసిపోవడం లేదని రుజువయ్యాక వ్యాపారపరంగా వీటి వాడకం పెరుగుతూ వచ్చింది.

పది రెట్లు మెరుగు


నిజానికి సహజంగా గనుల్లో దొరికే వాటిలోనూ 98శాతం వజ్రాల్లో నైట్రోజన్‌ ఛాయలు ఉంటాయి. కేవలం రెండు శాతమే నూటికి నూరుశాతం కర్బనం ఉన్న స్వచ్ఛమైన వజ్రాలు దొరుకుతాయంటారు నిపుణులు. స్వచ్ఛత విషయాన్ని పక్కన పెట్టినా నాణ్యత, అందం విషయాల్లోనూ అవన్నీ ఒకే తీరుగా ఉండవు. చాలా వజ్రాలు అత్యంత కఠినంగా ఉంటాయి. సరైన ఆకృతిలో ఉండవు. కొన్నిటిని సానబెట్టి పాలిష్‌ చేస్తే అందంగా తయారవుతాయి. అలా కాని వాటిని పరిశ్రమల్లో వాడతారు. మొత్తంగా ఉత్పత్తి అవుతున్న వజ్రాల్లో 30 శాతం మాత్రమే నగలకు వినియోగిస్తుండగా మిగిలిన 70 శాతమూ పరిశ్రమలకు ఉపయోగపడేవే ఉంటున్నాయట. వజ్రాలను సానబెట్టే పరిశ్రమలోనూ, ఇతర లోహ పరిశ్రమల్లోనూ, ఆటోమొబైల్‌ పరిశ్రమలోనూ... డ్రిల్లింగ్‌, గ్రైండింగ్‌, కోత పనులు చేసే యంత్రాల్లో ఈ వజ్రాలను వివిధ రూపాల్లో వాడతారు. ఇప్పుడు ప్రయోగశాలలో తయారుచేసినవాటిని కూడా ఈ పనులన్నిటికీ వాడవచ్చు. రెండిటి మధ్యా ఏవిధమైన తేడా ఉండదు. జెమాలజిస్టులు కూడా ప్రత్యేక పరికరాల సాయం లేకపోతే ఏది సహజంగా తయారైందో ఏది ప్రయోగశాలలో తయారైందో గుర్తించలేరట. పైగా వజ్రం యొక్క ప్రత్యేక లక్షణాలైన స్వచ్ఛత, కఠినత్వం- రెండిటిలోనూ ల్యాబ్‌ డైమండ్సే పది రెట్లు ఎక్కువ దీటైనవని నిపుణులు తేల్చిచెప్పారు. అందుకే పరిశ్రమల్లోనే కాదు, నగల విషయంలోనూ నెక్లెస్‌లు, పెండెంట్లు, ఉంగరాలు, బ్రేస్‌లెట్లు, గాజులు, చెవిదుద్దులు... ఇలా, మామూలు వజ్రాలతో ఏమేం చేయవచ్చో వీటితోనూ అవన్నీ చేసేస్తున్నారు నగల వ్యాపారులు.

మనదేశంలో...


మొట్టమొదటి వజ్రాలు మనదేశంలోనే దొరికినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాదు, చరిత్ర ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ ఇక్కడ దొరికినవే. వజ్రాలను సానబెట్టడంలోనూ, రకరకాల నగలు తయారుచేయడంలోనూ కూడా ప్రత్యేకతను చాటుకుంటున్న మన దేశం కృత్రిమ వజ్రాల తయారీలోనూ ముందు నిలవడం ద్వారా మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లేబొరేటరీలో తయారవుతున్న వజ్రాల్లో నాలుగోవంతు మన దేశంలోనే తయారవుతున్నాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిసి అరవై నుంచి డెబ్భై లక్షల క్యారట్ల వరకూ తయారుచేయగా గతేడాది మనదేశంలోనే పదిహేను లక్షల క్యారట్ల వజ్రాలను తయారుచేసినట్లు జెమ్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ వారి లెక్కలు చెబుతున్నాయి. సూరత్‌లో బకుల్‌ లింబాసియాకి చెందిన ‘న్యూడైమండ్‌ ఎరా’ కంపెనీ దాదాపు దశాబ్దం నుంచీ సీవీడీ పద్ధతిలో వజ్రాలను తయారుచేసి ఎగుమతి చేస్తోంది. ఆ తర్వాత ఇతర కంపెనీలూ ఈ రంగంలోకి వచ్చాయి. ఇక్కడ తయారైన వజ్రాల్లో చాలా భాగం ఎగుమతి చేస్తున్నారు. ఇక, నగల తయారీ దగ్గరకు వస్తే- అనంతా డైమండ్స్‌, వాండల్స్‌, ప్యూర్‌క్యారట్‌, డీఐ డిజైన్స్‌, లైమ్‌లైట్‌ డైమండ్స్‌, ఫియోనా డైమండ్స్‌ లాంటి బ్రాండ్లు దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలోనూ ల్యాబ్‌ డైమండ్స్‌తో తయారైన నగలను విక్రయిస్తున్నాయి. సహజ వజ్రాలకు ఇచ్చినట్లే బైబ్యాక్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్లనీ ఇస్తున్నాయి. పది పన్నెండేళ్ల క్రితం ఒక క్యారట్‌ సింథటిక్‌ డైమండ్‌ తయారీకి దాదాపు మూడు లక్షలు ఖర్చయ్యేదట. ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకోవడం వల్ల ఇప్పుడు 22-36 వేల మధ్య ఖర్చవుతోంది. దాంతో వీటి ధర కూడా బాగానే తగ్గిందనీ ముందు ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందనీ అంటున్నాయి వ్యాపారసంస్థలు. ఇప్పుడు వాటి దృష్టి అంతా ప్రధాన వినియోగదారులైన యువతను ఆకట్టుకోవడం మీదే ఉంది.

మనసు గెలిచాయి!


బెయిన్‌ అండ్‌ కంపెనీ తాజా నివేదిక ప్రకారం- తయారీలో ఏ దశలోనూ పర్యావరణానికి హానిచేయని వస్తువుల వైపు 70 శాతం యువత మొగ్గుచూపుతోంది. వారి కొనుగోలు నిర్ణయాలన్నిటినీ ఈ అంశమే ప్రభావితం చేస్తోంది. ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వేధిస్తున్న వైరస్‌ వ్యాప్తి వారి సామాజిక స్పృహను మరింతగా పెంచింది. ప్రపంచంలోని యువ జనాభాలో 41శాతానికి పైగా మనదేశంలోనే ఉంది. వారిలో 78శాతం ఆస్తులు సమకూర్చుకోవడం కన్నా అనుభవాలు సంపాదించడానికే పెద్దపీట వేస్తున్నారని వినియోగదారుల మనస్తత్వాలను అంచనా వేసే అధ్యయనాలు చెబుతున్నాయి. వారందరినీ తమ వినియోగదారులుగా మార్చుకోవాలన్నది ఇప్పుడు వజ్రాల తయారీ, నగల తయారీ సంస్థల లక్ష్యం. అందుకే అవి వజ్రాలను ప్రయోగశాలలో తయారు చేయడం వల్ల భూమికి ఎన్ని విధాలుగా మేలు జరుగుతోందో లెక్కలేసి చెబుతున్నాయి.

గనుల తవ్వకం వల్ల ఎంతో భూభాగం ఎందుకూ పనికిరాని బీడుగా మారుతోంది. దాని చుట్టుపక్కల ఉండే జీవవైవిధ్యమూ అంతరించిపోతోంది. ఒక క్యారట్‌ డైమండ్‌ను వెలికితీయడానికి 250 టన్నుల మట్టిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. 109 గ్యాలన్ల నీరు వృథా అవుతుంది. పైగా వేలాది కార్మికులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమటోడ్చాల్సి ఉంటుందనీ ‘డైమండ్‌ ఫౌండ్రీ’ లెక్కలు వేసింది. ప్రయోగశాలలో వజ్రాలను తయారుచేస్తే ఈ నష్టాలేవీ ఉండవనీ, ఒక్క విద్యుత్తు వాడకం మాత్రమే ఎక్కువవుతుందనీ దాన్ని కూడా పర్యావరణంపై ప్రభావం చూపనివ్వకుండా చర్యలు తీసుకుంటామనీ తయారీ సంస్థలు హామీ ఇస్తున్నాయి.

‘పర్యావరణం పట్ల పట్టింపు ఉన్న తరానికి చేరుకున్నాం. వారి ఇష్టాలకు తగినట్లుగా మారడం నేటి అవసరం’ అని ప్రకటిస్తూ 130 ఏళ్లుగా వజ్రాల గనులను నిర్వహిస్తూ, నగలను తయారుచేస్తూ వస్తున్న ‘డి బీర్స్‌’ కంపెనీ కూడా కృత్రిమ వజ్రాల తయారీ చేపట్టింది. ‘లైట్‌బాక్స్‌’ పేరుతో సొంత బ్రాండ్‌ పెట్టి ఆ నగలను విక్రయిస్తోంది.

ఉపయోగాలెన్నో!
ఏటా ప్రపంచవ్యాప్తంగా 15కోట్ల క్యారట్ల వజ్రాలు అమ్ముడవుతున్నాయి. జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ లెక్క ప్రకారం మనదేశం 2019లో దాదాపు మూడువేల కోట్లు విలువ చేసే వజ్రాలను ఎగుమతి చేయగా ఏడాది తిరిగేసరికల్లా అది 74 శాతం పెరిగిందట. ఎన్నో రంగాల్లో వజ్రాల వాడకం పెరగడమే అందుకు కారణం. కారులోని సున్నితమైన భాగాల మధ్య వజ్రపు పొడితో పలుచని పూత వేస్తే 40శాతం రాపిడి తగ్గి ఆయా విడిభాగాల మన్నిక గణనీయంగా పెరిగినట్లు నిస్సాన్‌ కంపెనీ ప్రకటించింది. అందుకే ఇప్పుడు పవన విద్యుత్తు తయారీకి వాడే గాలిమరల్లోనూ దీన్ని వాడుతున్నారు. కలుషిత జలవనరులను శుభ్రం చేయడానికీ, విద్యుత్‌ పరికరాల్లో సెమికండక్టర్‌గా... ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి వజ్రాలకు. తళతళా మెరుస్తాయి... పైగా గీతలూ పడవు కాబట్టి డైమండ్‌ పూత పూసిన గాజుపాత్రలూ, డిన్నర్‌సెట్లూ కూడా త్వరలోనే భోజనాల బల్లలను అలంకరించే అవకాశమూ ఉందట.

అందుకే... నిశ్చితార్థమప్పుడు తెచ్చిన బంగారు ఉంగరాలు చూడగానే... ‘డైమండ్‌ రింగ్స్‌ అయితే బాగుండేది’ అనబోయి- పెళ్లి ఖర్చులు గుర్తొచ్చి నోట్లోనే ఆపేసిన మాటనీ...

ఇరవైఐదో పెళ్లి రోజుకి ఏం కావాలీ అని అడిగిన భర్తకి... ‘డైమండ్‌ నెక్లెస్‌’ అని చెప్పబోయి- కట్టాల్సిన పిల్లల ఫీజులు గుర్తొచ్చి ఏమీ వద్దంటూ అటకెక్కించిన ఆశనీ... ఇప్పుడు నెరవేర్చుకోవచ్చేమో చూడండి మరి!

వజ్రాలే... రంగుల్లో!

క్రిస్టల్‌ ఆభరణాలూ అలంకరణ వస్తువులకు పేరొందిన స్వరోవ్‌స్కి సంస్థ నాలుగేళ్ల క్రితమే వజ్రాల తయారీ రంగంలోకి ప్రవేశించింది. మామూలు వజ్రాల తయారీతో ఆగిపోకుండా తనదైన ప్రత్యేకత నిలుపుకుంటూ రంగుల్లో మెరిసిపోతున్న వజ్రాలను తయారుచేసి విక్రయిస్తోంది. సహజమైన వజ్రాల్లో రంగుల వజ్రాలు అరుదు. ఆ లోటు తీర్చేలా ఈ సింథటిక్‌ వజ్రాలను పలు ఛాయల్లో తయారుచేసింది స్వరోవ్‌స్కి. డి బీర్స్‌ కంపెనీ తమ ‘లైట్‌ బాక్స్‌’ బ్రాండ్‌ కింద గులాబీ, నీలం, రంగులేని వజ్రాలను మాత్రమే తయారుచేస్తుండగా స్వరోవ్‌స్కి ఒకేసారి 16 రంగుల్లో వజ్రాలను తయారుచేయడం విశేషం. కలర్‌, కట్‌, సైజ్‌... అన్నిటినీ కూడా సాధ్యమైనంత విభిన్నంగా తేవడానికి ప్రయత్నిస్తున్నామనీ అప్పుడే వాటితో అద్భుతమైన ఆభరణాలు రూపొందించవచ్చనీ అంటోందీ సంస్థ. 0.25 క్యారట్ల నుంచి ఒకటిన్నర క్యారట్ల వరకూ ఉన్న ఈ వజ్రాల్లో అరుదైన రంగులవి కొన్ని రెండున్నర క్యారట్ల వరకూ ఉన్నాయి. ఈ సంస్థ వీటిని మనదేశంతో పాటు స్విట్జర్లాండ్‌, అమెరికా, చైనాలలో ఉన్న ఫ్యాక్టరీల్లో తయారుచేయిస్తోంది.

ఇదీ చదవండి:గర్భిణులపై మూడో దశ కరోనా ప్రభావం చాలా తీవ్రం

ABOUT THE AUTHOR

...view details