తెలంగాణ

telangana

ETV Bharat / city

Weather Changes: ముందుకొస్తున్న ముప్పు.. వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు - వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు

సముద్రం వేడెక్కడం, సాగర మట్టం గణనీయంగా పెరగడం వల్ల అతి భారీ వర్షాలు, తుపాన్ల తీవ్రత హెచ్చుతోంది. ఒక దశాబ్దంలో సముద్రంలో నీటిమట్టం మూడు నుంచి ఐదు మీటర్ల వరకు పెరుగుతోంది. మూడు మీటర్ల నీటిమట్టం పెరిగిందంటే 17 మీటర్ల తీర ప్రాంత భూభాగాన్ని కోల్పోయినట్లేనని భారత ఉష్ణ మండల వాతావరణ సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటరాలజీ) ప్రధాన శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ అభిప్రాయపడ్డారు. దీని తీవ్రతను తగ్గించేందుకు మనం తీసుకొంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవన్నారు. ‘‘ఇతర సముద్రాలతో పోల్చితే హిందూ మహాసముద్రం చాలా వేగంగా వేడెక్కుతోంది. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రత 1.2 నుంచి 1.4 డిగ్రీలు పెరిగింది. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల పెరిగిన 1.1 డిగ్రీల కంటే ఇది ఎక్కువ’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాలు అతి వేగంగా వేడెక్కడం, అంతర్జాతీయంగా వర్షపాతంలో వస్తున్న మార్పులు, వాతావరణంపై జరుగుతున్న పరిశోధనకు నాయకత్వం వహిస్తోన్న రాక్సీ.. స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రకటించిన టాప్‌ టు పర్సెంట్‌ శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇంటర్‌ గవర్నమెంట్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(ఐపీసీసీ) విడుదల చేసిన నివేదిక తయారీలోనూ ఈయన కీలక వ్యక్తి. తరచూ సంభవిస్తున్న అతి భారీ వర్షాలు, తుపాన్ల నేపథ]్యంలో వాతావరణ మార్పులు, దీని పర్యవసానాల గురించి ఆయన మాట్లాడారు.

Meteorologist Roxy Mathews
Meteorologist Roxy Mathews

By

Published : Sep 10, 2021, 4:08 AM IST

అతి భారీ వర్షాలు, తరచూ తుపాన్లు రావడానికి ఎలాంటి మార్పులు కారణమవుతున్నాయి


మంచు పర్వతాలు కరిగిపోవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా 1901-1971 మధ్య సముద్ర మట్టాలు దశాబ్దానికి 1.3 సెం.మీ పెరిగితే, 1971-2006లో అది 1.9 సెం.మీ. 2006-18 మధ్య ఇది 3.7 సెం.మీ. ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పు తీరప్రాంతం మధ్య దశాబ్దానికి మూడు నుంచి ఐదు సెం.మీ పెరుగుతోంది. బంగ్లాదేశ్‌ తీర ప్రాంతంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2100 నాటికి 40 సెం.మీ నుంచి ఒక మీటరు (100 సెం.మీ.)వరకు పెరగొచ్చు. తాజా ఐపీసీసీ నివేదిక ప్రకారం రెండు మీటర్ల వరకు పెరగడాన్ని కూడా తోసిపుచ్చలేం. 1950 తర్వాత ఉష్ణమండల హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం భారత భూభాగంపైన ప్రత్యేకించి కోస్తా ప్రాంతాలపైన చాలా ఒత్తిడి పెంచింది. రుతుపవనాలకు సంబంధించిన గాలుల్లో ఒడిదొడుకులూ పెరిగాయి. ఈ కారణంగా అతి భారీ వర్షాలు మూడు రెట్లు పెరిగి వరదలొస్తున్నాయి. చాలా తీవ్రమైనవి 150 శాతం పెరిగాయి. వెంట వెంటనే తుపాన్ల్లూ వచ్చే అవకాశాలున్నాయని తాజాగా ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఇలాంటివి భారతదేశంలో ఇప్పటికే జరిగాయి. 2021 మే నెలలో తౌక్తే, యాస్‌ తుపాన్లు వచ్చినపుడు ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉప్పెనలు వచ్చి నీటిని భూమి మీదకు తోశాయి. మొత్తమ్మీద దేశంలో రుతుపవనాల స్వభావం మారింది. ఎక్కువ రోజులు ఎలాంటి వర్షం లేకపోవడం, మధ్యలో మూడు నుంచి నాలుగురోజుల్లోనే అతి భారీ వర్షాలు కురవడం జరుగుతోంది.

సముద్రాల్లో ఈ పరిస్థితికి కారణమేంటి

బొగ్గుపులుసు వాయువుల (కార్బన్‌డై ఆక్సైడ్‌) విడుదల పెరిగి గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీసింది. దీని ద్వారా వచ్చే వేడిలో 93 శాతం సముద్రాలు తీసుకొంటే...భూమి, వాతావరణం, మంచు తీసుకొనేవి ఏడు శాతం లోపు మాత్రమే. సముద్రంలో నీరు వేడెక్కడం వల్ల పగడాలు, మత్స్య సంపద కూడా అంతమవుతోంది. బంగాళాఖాతంలో నీరు ఇప్పటికే వెచ్చగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం మూడు, నాలుగు తుపాన్లు సంభవిస్తున్నాయి. బంగాళాఖాతంతో పోల్చితే చల్లగా ఉంటే అరేబియా నీళ్లు కూడా మారిపోతున్నాయి. ఫలితంగా ఇక్కడా 50 శాతం తుపాన్లు పెరిగాయి. గతంలో రెండేళ్లకు ఒక తుపాను వచ్చేది. తుపాన్లలో వేగం కూడా మారుతోంది. తౌక్తే తదితర తుపాన్లు 24 గంటల్లోపే బలహీనత నుంచి ఉద్ధృతంగా మారాయి. ఇలాంటి పరిస్థితి తుపాన్లను అంచనావేసే వారికి పెద్ద సవాలు. విపత్తుల నిర్వహణ సంస్థలకూ సంకటమే. 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు వేడెక్కడంతో పాటు ఆమ్లీకరణ చెందడం, ఆక్సిజన్‌ స్థాయులు తగ్గడం జరిగింది. 21వ శతాబ్దంలో ఇవి నాలుగు నుంచి ఎనిమిది రెట్లు పెరగ్గా, ఇది ఇంకా పెరగుతూనే ఉంది.

వరదల ప్రభావం పెరగడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారా

తాజాగా భారతదేశంలోనూ, యూరప్‌, చైనాలో వచ్చిన వరదలు, కెనడా, అమెరికాలో వడగాడ్పులు మనల్ని మేల్కొలుపుతున్నాయి. గతంలోనే పరిస్థితి తీవ్రంగా ఉన్నా మనం పట్టించుకోవడం లేదు. తాత్కాలికంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నాం. యూరప్‌లో తీవ్రంగా వచ్చిన వడగాడ్పులకు 2003లో 70వేల మంది మరణించారు. 2005లో ముంబయి వరదల్లో వెయ్యిమందికి పైగా చనిపోయారు. ఈ నగరానికి వరద సాధారణమైంది. ఇక్కడ పరిశోధనలో తేలిందేమిటంటే మానవ తప్పిదం వల్ల వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం.

దీనికి పరిష్కారం ఉందా

వీటి నుంచి మనం ఏం నేర్చుకోవడం లేదు. సమస్య అంతర్జాతీయమైంది. సవాళ్లు స్థానికమైనవి కాబట్టి కార్యాచరణ కూడా అలాగే ఉండాలి. ఉదాహరణకు ముంబయి, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌ ఇలా ఏ నగరానికి ఉన్న సమస్యలు వాటికున్నాయి. పల్లె.. పట్టణాలకూ తేడాలున్నాయి. దీనికి తగ్గట్టుగా విపత్తుల యాజమాన్యానికి సిద్ధం కావాలి. ఐపీసీసీ నివేదిక ఒక విస్తృతమైన అంచనాను మన ముందు పెట్టింది. చేయాల్సింది ఎక్కడికక్కడ స్థానికంగానే. దేశంలోని ప్రతి జిల్లాను వాతావరణ మార్పులకు తగ్గట్లుగా సిద్ధమయ్యేలా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా భూ వినియోగ మార్పిడి సందర్భాల్లో వాతావరణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఏజెన్సీలు కూడా వెళ్లలేని కొన్ని ప్రాంతాల్లో సిటిజన్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌లు సాయం చేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో ప్రజలను ఈ నెట్‌వర్క్స్‌ అప్రమత్తం చేసిన సంఘటనలు అనేకం. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ప్రభుత్వ సంస్థల సహకారంతో ఇవి అద్భుతంగా నడుస్తున్నాయి. అనేక చోట్ల ప్రజల ప్రాణాలను కాపాడాయి. ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవాలి.

వాతావరణంలో మార్పుల ప్రభావం తీరప్రాంతాలపైనే ఎక్కువగా ఉంటుందా

న్ని ప్రాంతాలపైనా ఉంటుంది.ఈ ఏడాది జులైలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో రెండు రోజుల్లోనే 1074 మి.మీ వర్షం పడింది. అంటే ప్రతి చదరపు మీటరులో ఒక మీటరు కంటే ఎక్కువ ఎత్తు వర్షం పడినట్లు. వందేళ్లలో ఇదే అత్యధికం. ఫలితంగా దిగువన ఉన్న పట్టణాలను వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించారు. నేను పుణెలో ఉంటాను. వాతావరణ పరంగా సురక్షితమైంది. అయితే జూన్‌,జులైలో సాధారణం కంటే 34 శాతం ఎక్కువ వర్షం పడింది. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం మీద ఆధారపడి జీవించే సన్న,చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 21వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు అంతకు ముందు కంటే 24 శాతం ఎక్కువగా వరదల ప్రభావానికి గురికావాల్సి వచ్చింది.

ఇవీ చూడండి:prathidwani: అన్నదాతలను ఆదుకునే మార్గాలు ఏంటి?

ABOUT THE AUTHOR

...view details