పాఠశాలకు రోజూ గోడ దూకి వెళ్లాల్సిన దుస్థితి ఆ విద్యార్థులకు తప్పింది. దారి సమస్య పరిష్కారమయ్యింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలో ప్రాథమిక పాఠశాలకు రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. స్థల యజమానితో చర్చించి సమస్య పరిష్కరించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. 'గోడ' చదువులకు విముక్తి - కరివేన పాఠశాల వార్తలు
ఏపీలోని కర్నూలు జిల్లా కరివేనలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమస్య పరిష్కారమైంది. చదువు కోసం రోజూ సర్కస్ ఫీట్లు చేస్తోన్న ఆ విద్యార్థుల సమస్యను ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన అధికారులు పాఠశాలకు రాకపోకలు పునరుద్ధరించారు.
ఈ సమస్యపై ‘ఈటీవీ భారత్’లో కథనాలు రావడం వల్ల.. డీఈవో సాయిరాం, ఎస్‌ఎస్‌ఏ పీవో విద్యాసాగర్, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి తిలక్, మండల అధికారులు.. శనివారం పాఠశాలను సందర్శించారు. మండల తహసీల్దారు స్థల యజమానితో చర్చించి 10 అడుగుల దారి వదిలేందుకు ఒప్పించారు. దీనికి ప్రత్యామ్నాయంగా 3 సెంట్ల స్థలం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం నుంచి సజావుగా పాఠశాల నిర్వహించేందుకు.. భవిష్యత్‌లో మళ్లీ దారి మూయకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. పాఠశాల ప్రహరీ నుంచి 10 అడుగులు సీసీ రహదారి 10 రోజుల్లో నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.