వినోదంతోపాటు విజ్ఞానం, విలువలు నేర్పేందుకు బాలల కోసమే ప్రత్యేకంగా బాలభారత్ ఛానెల్‌ను తీసుకొచ్చింది ఈటీవీ నెట్‌వర్క్. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తెలుగు, తమిళంతోపాటు.. ఇంగ్లిష్‌లోనూ ఈ ఛానెల్ ప్రసారమవుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ ఛానెళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సరిగ్గా 10 గంటల 35 నిమిషాలకు.. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు.. 12 బాలభారత్ ఛానెళ్లను ప్రారంభించారు. చిన్నారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ ఛానెళ్ల ప్రసారాలు ఉంటాయని ఆయన అన్నారు.
'ప్రియమైన పిల్లల్లారా.. అందరి అభిమానం పొందడానికి మీరంతా అర్హులు. హద్దుల్లేని మీ ఉత్సాహం, మీలోని ఉత్సుకత, అద్భుతమైన మీ ఆలోచన శైలి, కొంటెతనం, సృజనాత్మకత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. 'ఈటీవీ బాలభారత్' అనే అద్భుతమైన బహుమతిని మీకు అందిస్తున్నాను. మీ మాతృభాషతోపాటు ఇంగ్లిష్‌లో మీకోసమే తీసుకొచ్చిన టీవీ ఛానల్‌ను.. మీరు ఇష్టంగా చూసే అనేక కార్యక్రమాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. మీలోని సూపర్‌హీరోలు కోరుకునే సాహసం, స్ఫూర్తితో పాటు.. మ్యాజిక్, మిస్టరీ, మీకు సరైన మార్గం చూపే నీతికథలు ఇందులో ఉంటాయి. 'బాలభారత్' ద్వారా అంతులేని వినోదం, అందమైన ప్రపంచం, కార్టూన్లు, అద్భుత చిత్రాలు మీకు అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఈటీవీ బాలభారత్‌ను దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు అంకితమిస్తున్నాం.' - రామోజీ రావు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్