Etela Rajender: హస్తినలో ఈటల.. భాజపాలో చేరిక జూన్ 2 తర్వాతే..! - ఈటల రాజేందర్ వార్తలు
17:31 May 30
ఈటలను జేపీ నడ్డాకు పరిచయం చేయనున్న బండి సంజయ్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన భాజపాలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి దిల్లీ వచ్చారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, భాజపా నేత జి.వివేక్ వెంకటస్వామి ఉన్నారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం ఈటల భేటీ కానున్నారు.
హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం దిల్లీ చేరుకోనున్నారు. అయిదారు రోజుల్లో ఈటల హుజూరాబాద్ వెళ్లి వచ్చాక భాజపాలో చేరతారని.. నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, తెరాసకు రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.