Etela: 'కొత్త పార్టీ పరిష్కారం కాదు.. అందరం ఏకమవుదాం' - శామీర్‌పేటలో ఈటల రాజేందర్‌తో పలువురు నేతల భేటీ
10:11 May 27
శామీర్‌పేటలో ఈటల రాజేందర్‌తో పలువురు నేతల భేటీ
ఈటల రాజేందర్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ వైఖరి సరైంది కాదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మేడ్చల్‌లోని ఈటల నివాసంలో కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించినట్టు కోదండరాం తెలిపారు.
భూకబ్జా విషయంలో ఈటల కుటుంబ సభ్యులను కూడా ఇరికించి వేధించడం అన్యాయమని కోదండరాం అభిప్రాయపడ్డారు. అందరూ ఏకతాటిపై ఉండాల్సిన సమయమిదని కోదండరాం సూచించారు. ఒకే ఆలోచనతో ఒకే మార్గంలో సాగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త పార్టీ పెట్టడం ఒక్కటే పరిష్కారం కాదని కోదండరాం వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్షలకు ఇది సమయం కాదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ తప్పు చేస్తే సస్పెండ్ చేయాలన్న కొండా... భూములు ఆక్రమిస్తే పార్టీలో ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్నించారు. కొత్త పార్టీ గురించి తమకు తొందర లేదని స్పష్టం చేశారు. కొవిడ్ నుంచి రాష్ట్రం గట్టెక్కడమే తమకు కావాలన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఐక్యత ఇప్పటికైనా జరగాలిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.