మాజీ మంత్రి ఈటల రాజేందర్ పలువురు నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. తెరాస నుంచి బయటకు వచ్చిన వారు, అసంతృప్తితో ఉన్న వారితో పాటు.. వివిధ పార్టీల నేతలను కూడా కలుస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తున్నారు. గత మూడు రోజులుగా వివిధ పార్టీల నేతలు, మేథావులను కలిశారు. ఇవాళ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను వారి నివాసంలో కలిసి... సుమారు రెండు గంటల పాటు చర్చించారు.
వరుస భేటీలు.. చర్చోపచర్చలు... రాజకీయ భవిష్యత్తుపై ఈటల మథనం - కొత్త పార్టీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తుపై... నేతలు, విశ్రాంత అధికారులు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులతో వరసగా భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలిశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా తెరాస వ్యతిరేకులందరితో కలిసి ఓ ఐకాస ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఈటల చర్చోపచర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారం, పది రోజుల్లో ఈటల స్పష్టతనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
భాజపా నేతలు బండి సంజయ్, డీకే అరుణ, స్వామిగౌడ్, చంద్రశేఖర్, టీపీసీసీ నేతలు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం తదితరులను కలిశారు. అంతకుముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాములు నాయక్‌తో ఈటల చర్చలు జరిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, తెరాసకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కలిసినట్లు సమాచారం. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులతో పాటు.. వివిధ సంఘాల నాయకులతో భేటీ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టాలా లేక తెరాస వ్యతిరేకులందరినీ ఏకతాటి పైకి తెచ్చి... ఉద్యమ ఐకాస ఏర్పాటు చేయాలా అనే అంశంపై చర్చోపచర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి, తెరాస సభ్యత్వానికి రాజీనామా చేయాలా వద్దా..? ఒకవేళ చేస్తే ఏ సందర్భంలో...? అనే అంశంపై ఈటల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే... స్పందన ఎలా ఉంటుందనే అంశంపై కూడా ఈటల అనుచరులు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వారం, పది రోజుల్లో రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నట్లు అనుచరులతో ఈటల చెబుతున్నట్లు సమాచారం.