Etela Rajender fires on TRS: తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెరాస నేతలే సభాపతి గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 20 ఏళ్లలో స్పీకర్‌ను అవమానించిన ఘటనలు లేవని వెల్లడించారు. మరమనిషి అన్నందుకు తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులే నిర్వహించడమేంటన్న ఈటల... ప్రజాసమస్యలపై పోరాడేందుకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. బీఏసీ సమావేశానికి భాజపా ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చావుకు సిద్దపడుతానే తప్ప రాజీ పడేదేలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దమ్ముంటే తన మొహాన్ని సీఎంను చూడమనండనీ.. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో చెప్పండని సవాల్ విసిరారు. స్పీకర్ సభకు అధిపతి అని అందరి హక్కులు కాపాడాలన్నారు. స్పీకర్ తనకు తండ్రిలాంటివారని పేర్కొన్నారు. హుందాగా బతికిన వ్యక్తి స్పీకర్ అని అటువంటి వ్యక్తిని అగౌరపరిచింది తాను కాదన్నారు. ప్రజ సమస్యలు మీద 20 ఏళ్లుగా ఏ విధంగా ప్రస్తావించానో అదే విధంగా ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రతిపక్షాలను కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు ఎందుకు అనుమతివ్వడంలేదని ప్రశ్నించారు.