Etela Rajender Comments: రైతుల నోట్లో మట్టి కొట్టే రాజకీయాలు చేస్తే.. గద్దె దిగటం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నేటితో ముగిసింది. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గ భాజపా నాయకులు డా. పాల్వాయి హరీశ్ బాబు.. కాగజ్‌నగర్ మండలం నుంచి తుమ్మిడిహెట్టి వరకు 66 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ ముగింపు సభకు ఈటల రాజేందర్ హాజరయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాణహిత నదికి మంగళహారతి పట్టారు.
ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెట్టి 14 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. జీవనదులకు నిలయమైన ఆదిలాబాద్‌లో రైతులకు చుక్క నీరు ఇవ్వకపోవడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తరలించి కాళేశ్వరం కట్టడం ద్వారా రైతాంగానికి తీరని అన్యాయం చేశారన్నారు.