తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈఎస్‌ఐ కుంభకోణంలో కొత్తమలుపు... ఈడీ, ఐటీ దర్యాప్తు - ESI scam: More skeletons tumble out

ఈఎస్‌ఐ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరింది. ఇప్పటివరకు అవినీతి నిరోధకశాఖ విచారణ జరుపుతుండగా... త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపుపన్నుశాఖ రంగంలోకి దిగనున్నాయి. కుంభకోణంపై అనిశా నుంచి సంబంధిత పత్రాలు సేకరిస్తున్నాయి. నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఈడీ త్వరలో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

ఈఎస్‌ఐ కుంభకోణం@ ఈడీ, ఐటీ దర్యాప్తు

By

Published : Nov 14, 2019, 5:09 AM IST

Updated : Nov 14, 2019, 7:15 AM IST

ఈఎస్‌ఐ కుంభకోణం@ ఈడీ, ఐటీ దర్యాప్తు

బీమా వైద్య సేవల సంస్థ కుంభకోణంపై దర్యాప్తు జోరందుకోనుంది. అక్రమాల నిగ్గుతేల్చేందుకు ఆదాయపుపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించాయి. ఇప్పటికే అనిశా నుంచి అధికారులు పత్రాలు సేకరిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు విచారణలో బయటపడగా.. మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది.

రూ. 250 కోట్లు - గోల్‌మాల్​

నాలుగేళ్లలో సుమారు వెయ్యి కోట్ల నిధులు మంజూరు కాగా... అందులో 250 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్టు అనిశా అంచనా వేస్తోంది. అన్ని దస్త్రాలు పరిశీలిస్తే కుంభకోణంలో మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. గోల్‌మాలైన కోట్ల నిధులను ఎటు మళ్లించారో ఈడీ తేల్చనుంది.

ఇంటి దొంగలే అక్రమార్కులు..

బీమా వైద్య సేవల కుంభకోణంతో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతోపాటు... ప్రైవేటు వ్యక్తులు అక్రమార్జన ద్వారా సమకూర్చుకున్న ఆస్తుల వివరాలు సేకరించనున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి 'ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌' కింద ఈడీ కేసు నమోదు చేయనుంది. అనిశా దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ ను న్యాయస్థానం ద్వారా సేకరించి దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయనున్నారు.

అడ్డగోలుగా నొక్కేశారు.. విదేశాలకు చెక్కేశారు..

మరోవైపు అక్రమార్జనతో ఈఎస్​ఐ అధికారులు అడ్డగోలుగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు, విదేశీ పర్యటనలు చేసినట్లు అనిశా గుర్తించింది. బీమా వైద్య సర్వీసుల కుంభకోణంపై ఈడీ, ఆదాయపన్నుశాఖ దృష్టి సారించడం వల్ల ఈ వ్యవహారంలో మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే: హైకోర్టు

Last Updated : Nov 14, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details