ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాల బండారం బయటపడుతోంది. ఏసీబీ సోదాల్లో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమాలకు సూత్రధారిగా ఉన్న ఓమ్ని మెడీ సంస్థ ప్రతినిధి నాగరాజు ఇంట్లో రూ.46 కోట్ల అంచనాలతో రూపొందించిన నకిలీ ఉత్తర్వులు బయటపడడం కలకలం రేపుతోంది. బీమా వైద్య సేవల సంస్థ సంచాలకుల కార్యాలయంలో ఉండాల్సిన ఉత్తర్వులు... ఓమ్ని మెడీ సంస్థ ప్రతినిధి ఇంట్లో దొరకటం చూసి అనిశా అధికారులు విస్తుపోయారు.
కీలకంగా మారిన దస్త్రాలు
గతేడాది ఆగస్టు నెలలోనే ఈ ఉత్తర్వులను సిద్ధం చేసినట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈఎస్‌ఐ అధికారులు తమకు కావాల్సిన మందుల వివరాలతో ఉత్తర్వులు సిద్ధం చేసి టెండర్లు పిలిచి, కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలి. అయితే ఇక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులే ఇలాంటి ఆధారాలు రూపొందించారు. వాటిపై అధికారుల సంతకాలు పెట్టించారు. మందులు సరఫరా చేసినట్టు కాగితాల్లో చూపించి డబ్బులు దండుకునేందుకు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే విభాగం అధికారులతో కుమ్మక్కై సంతకం తీసుకుని మిగతా తతంగం నడిపించాలని భావించారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఆరా అనంతరం అనిశా విచారణ మొదలు కావడం వల్ల తమ వ్యూహాన్ని పక్కకు పెట్టారు. లేకుంటే మరో రూ.46 కోట్ల అక్రమాలు జరిగేవి. దర్యాప్తులో భాగంగా నాగరాజు నివాసంలో స్వాధీనం చేసుకున్న ఇండెంట్లు కీలకంగా మారాయి.