తెలంగాణ

telangana

ETV Bharat / city

Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి - viveka murder case investigation

వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి... వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న చేసిన ఆరోపణలపై స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని తెలిపారు. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్రగంగిరెడ్డి వివరించారు.

Viveka murder case
వివేకా హత్య కేసు

By

Published : Jul 24, 2021, 2:24 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి... వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న చేసిన ఆరోపణలపై స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని తెలిపారు. తాను బెదిరించినట్లు కడప, పులివెందులలో ఎక్కడా కేసులు లేవన్నారు. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదని.. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్ర గంగిరెడ్డి వివరించారు. ఎర్రగంగిరెడ్డి వివేకా ప్రధాన అనుచరుడు.

రంగన్న ఏం చెప్పాడంటే...

‘ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరుకుతా’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారని రంగన్న అలియాస్‌ రంగయ్య తెలిపారు. అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదన్నారు. తనపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు చెప్పారన్నారు. జమ్మలమడుగు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి పులివెందులకు చేరుకున్న ఆయన కొంతమంది స్థానికులు, విలేకర్లతో మాట్లాడారు. ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. న్యాయమూర్తి ఎదుట ఏం చెప్పారని అడగ్గా, తనకు భయం వేస్తోందని రంగన్న సమాధానమిచ్చారు. భయపడాల్సిన పనిలేదని పదే పదే ప్రశ్నించగా అక్కడున్నవారి చెవిలో ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను చెప్పారు. ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని, ఏం అడిగినా ఏమీ తెలియదని సమాధానం చెప్పాలంటూ తనకు సీబీఐ అధికారులు సూచించారని వివరించారు. అయితే, అంతకుముందు మాత్రం అసలు న్యాయమూర్తితో ఏం చెప్పానో తనకు గుర్తులేదని రంగన్న చెప్పిన విషయం తెలిసిందే.

ఎవరీ రంగన్న..

కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురానికి చెందిన రంగన్న బతుకుతెరువు కోసం 16 ఏళ్ల కిందట పులివెందులకు వచ్చారు. తొలుత పులివెందుల పురపాలిక పరిధిలో స్వీపరుగా పనిచేశారు. 2017 నుంచి వివేకానందరెడ్డి ఇంటికి కాపలాదారుగా ఉన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 నాటికి ఆయనే ఆ ఇంటి కాపలాదారు. వివేకా బతికి ఉండగా చివరిసారి, చనిపోయాక మొదటిసారి చూసింది ఈయనే. మార్చి 15 ఉదయం వివేకా నిద్రలేచి బయటకు రాకపోయేసరికి పక్క డోరులో నుంచి లోపలికి వెళ్లి... స్నానపు గదిలో రక్తపుమడుగులో ఉన్నట్లు చూసి ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పింది రంగన్నే. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలుచేసిన రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో రంగన్న పేరూ ఉంది. హత్యకు సంబంధించిన విషయాలు రంగన్నకు తెలిసే అవకాశం ఉందని, అవి బయటపెడితే జరిగే పరిణామాలకు భయపడి ఆయన చెప్పకపోవచ్చని సునీత ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఇదీ చదవండి:సోషల్ మీడియాలో కేటీఆర్ హవా.. పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details