English Medium in Telangana Government Schools : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి విధి విధానాల రూపకల్పన, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయడంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అజయ్‌కుమార్, కమలాకర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
English Medium in Government Schools Telangana : ఆంగ్ల మాధ్యమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఆంగ్ల మాధ్యమంలో చేరే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా పాఠ్య పుస్తకాలను తెలుగు-ఆంగ్లం; ఉర్దూ- ఆంగ్లం..ఇలా ద్విభాష విధానంలో ముద్రించాలని సూచించింది. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను కమిటీ ఆదేశించింది. విద్యార్థులకు ఆంగ్లంలో ప్రత్యేక మెలకువలు నేర్పేందుకు అవసరమైతే టీ-శాట్ ఛానెళ్ల ద్వారా ప్రత్యేక పాఠాలను అందించాలని నిర్ణయించింది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నందున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఆంగ్ల మాధ్యమంతో భవిష్యత్తులో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సూచించింది.