నాలాలను పునరుద్ధరించడం, ఆక్రమణలు తొలిగించడం ద్వారా వరద నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని ఇంజనీర్లు, నిపుణులు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వరద నీటి ముంపు సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంజినీర్లు, ఆయా రంగాల నిపుణులు సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. అనంతరం మంత్రుల అధికార నివాసంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో వారు భేటీ అయ్యారు.
లింక్ చేయడం ద్వారా..
గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని 185 చెరువులను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లింక్ చేయడం ద్వారా వరద ప్రవాహాన్ని మళ్లించి.. ముంపు సమస్యను అధిగమించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి.. శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆ కమిటీ నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు.
మొదటి సారిగా 45 శాతం:
వంద సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 17 వేల మంది చనిపోయారన్నారు. ప్రస్తుతం ప్రాణ నష్టం తగ్గిందని నిపుణులు వివరించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన కాలనీల్లో 45 శాతం మొదటి సారిగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. మరో 35 శాతం కాలనీలు రెండు మూడోసారి, మిగతా 10 శాతం కాలనీలు పలుమార్లు ముంపుకు గురయ్యాయని సర్వేలో వెల్లడైందని ఇంజనీర్లు తెలిపారు.
నిరంతరం శుద్ధి:
గండిపేట ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరద నీటిని మూసీ నది పరీవాహక ప్రాంతంతో అనుసంధానం చేసి, ఆక్రమణలు తొలగించడం ద్వారా వరద నీటిని సులువుగా తరలించవచ్చని ఇంజనీర్లు పేర్కొన్నారు. మూసి నదిలోని మురికి నీటిని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిరంతరం శుద్ధి చేసి, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వరద నీటిని కింది భాగానికి తరలిస్తే బాగుంటుందని నిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వరద నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లకు సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి: రైతులు నష్టపోవద్దనే మక్కలు కొంటున్నాం: నిరంజన్ రెడ్డి