తెలంగాణ

telangana

ETV Bharat / city

EAMCET Counselling: ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయింపు.. 82.24 శాతం భర్తీ - ఇంజినీరింగ్ సీట్లు భర్తీ

engineering-first-phase-seat-allotment-completed
engineering-first-phase-seat-allotment-completed

By

Published : Sep 18, 2021, 5:10 PM IST

Updated : Sep 18, 2021, 10:53 PM IST

17:05 September 18

EAMCET Counselling: రాష్ట్రవ్యాప్తంగా 60,941 ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు

రాష్ట్రంలో ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను ఇవాళ కేటాయించారు. మొదటి విడతలో 60,941 కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయి. మరో 13,130 సీట్లు మిగిలాయి. ధ్రువపత్రాల పరిశీలనకు 71,216 మంది అభ్యర్థులు హాజరు కాగా... 69,793 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 74,071 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. వాటిలో 82.27 శాతం.. 60,941 సీట్లను ఇవాళ కేటాయించారు. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,108 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. రాష్ట్రంలోని 6 యూనివర్సిటీ, 25 ప్రైవేట్ కాలేజీల్లో సీట్లన్నీ మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 యూనివర్సిటీ కాలేజీల్లో 3,994 సీట్లు ఉండగా.. 3,852 భర్తీ అయ్యాయి. కేవలం 144 మిగిలాయి. రెండు గ్రీన్ ఫీల్డ్ కేటగిరీల్లో ప్రైవేట్ యూనివర్సిటీల్లోని 1,565 సీట్లలో.. 1,394 భర్తీ అయ్యాయి. 171 మాత్రమే మిగిలాయి. రాష్ట్రంలోని 158 ప్రైవేట్ కాలేజీల్లోని 68,512 సీట్లలో 55,695 సీట్లను మొదటి విడతలో కేటాయించగా.. మరో 12,817 మిగిలాయి.  

కంప్యూటర్​ కోర్సులకే డిమాండ్​...

ఇంజినీరింగ్​లో కంప్యూటర్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు మొగ్గు చూపారు. ప్రముఖ కాలేజీల్లోని సీఎస్ఈ సీట్లన్నీ మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి. సీఎస్ఈ, కృత్తిమ మేథ, మెషిన్ లెర్నిక్, ఐటీ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి ఎక్కువ స్పందన కనిపించింది. సీఎస్ఈలో మొదటి విడతలోనే 99.72 శాతం భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో అత్యధికంగా 18 వేల 614 సీట్లు ఉండగా.. కేవలం 53 మిగిలాయి. ఐటీలో 99.26శాతం, సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్​లో 92శాతం, డేటా సైన్సులో 91శాతం భర్తీ అయ్యాయి. కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇనుస్ట్రమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమేటిక్స్, మెటలర్జీ, మెక్​ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎంటీఈ, ఎంఎంఎస్, అగ్రికల్చరల్, బయోటెక్నాలజీ, డెయిరీయింగ్ కోర్సుల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సంప్రదాయ ఇంజినీరింగు కోర్సులైన సివిల్, మెకానికల్, ట్రిపుల్​కి విద్యార్థుల నుంచి ఆదరణ కనిపించలేదు. మెకానికల్​లో 43.36, సివిల్​లో 51.07, ఈఈఈలో 57.49శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్​లో 41 శాతం, ఎఫ్​ఎస్​పీలో 33శాతం, మైనింగ్ ఇంజినీరింగ్​లో 52, ఐపీఈలో కేవలం 7శాతం సీట్లు భర్తీ అయ్యాయి.  

ఆ సీట్లకు స్పందన కరవు..

బీఫార్మసీ, ఫార్మ్​డీ కోర్సుల్లో ఎంపీసీ కోటా సీట్లకు ఈ ఏడాది కూడా స్పందన కరవైంది. బీఫార్మసీ, ఫార్మ్​డీలో ఎంపీసీ అభ్యర్థుల కోటాలో 95 శాతం మిగిలిపోయాయి. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3,628 సీట్లలో కేవలం 182. ఫార్మ్​డీలో 4 వేల 199 సీట్లలో 228 మాత్రమే భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 23లోగా ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబరులో తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత అవసరమైతే తుది విడత కౌన్సెలింగ్​లో పాల్గొనవచ్చునని నవీన్ మిత్తల్ తెలిపారు.  

ఇదీ చూడండి:

Last Updated : Sep 18, 2021, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details