సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల విభాగం (ఐఎంఎస్) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఐఎంఎస్ అధికారులకే పరిమితమైన ఈ అవినీతి బాగోతంలో రాజకీయ నేతల ప్రమేయం బహిర్గతమైంది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో పెద్దఎత్తున నగదు పట్టుబడటంతో కుంభకోణంలో ఆయన పాత్రపై దర్యాపు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఏడు ప్రాంతాల్లో ఈడీ శనివారం గంటలకొద్దీ నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు, సుమారు రూ.కోటి విలువైన నగలు, అక్రమాస్తుల పత్రాలతోపాటు ఖాళీ చెక్కులు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, లాకర్లు లభ్యమైనట్లు వెల్లడించింది. శ్రీనివాస్‌రెడ్డితో పాటు నాయిని మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి (ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి), డొల్ల ఫార్మా కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి, ఐఎంఎస్ కుంభకోణం ప్రధాన సూత్రధారి డా.దేవికారాణి, ఓమ్ని మెడీ సంస్థ నిర్వాహకుడు శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలకు చెందిన ఇళ్లలో, కార్యాలయాల్లో మొత్తం ఏడు చోట్ల ఈ సోదాలు జరిగాయి. శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రూ.1.5 కోట్లు, ప్రమోద్‌రెడ్డి ఇంట్లో రూ.1.15 కోట్లు, వినయ్‌రెడ్డి ఇంట్లో రూ.45 లక్షల నగదు లభ్యమైంది.
నిధులు దారి మళ్లినట్లు ఆరోపణలు..
కార్మికశాఖ పరిధిలోని ఐఎంఎస్ విభాగంలో కుంభకోణం జరిగిన సమయంలో ఆ శాఖ మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. ఈ విభాగం పరిధిలోని డిస్పెన్సరీల్లో మందుల కొనుగోళ్లకు, రోగులకు సేవలందించేందుకు 2016 నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల కాగా.. వీటిలో నుంచి పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం 2019లోనే విచారణ జరిపింది. దాదాపు రూ.200 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ 8 కేసులు నమోదు చేసింది. ఆ విభాగం అప్పటి డైరెక్టర్ డా.దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి, ఆ విభాగంలోని పలువురు అధికారులతోపాటు ప్రైవేటు ఫార్మా కంపెనీల నిర్వాహకుల్ని అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో ఇంకా పెద్ద తలల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమైనా ఏసీబీ దర్యాప్తు మాత్రం డా.దేవికారాణి వరకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. నిధుల మళ్లింపు వ్యవహారంపై కొన్ని నెలల క్రితం గురుమూర్తిని విచారించడంతో కేసు మలుపు తిరిగింది. కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము మరికొంతమంది చేతులు మారిందని వెలుగుచూసింది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ముకుందరెడ్డిని ఈడీ విచారించడంతో మరిన్ని ఆధారాలు లభించాయి. కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ములోనుంచి గురుమూర్తి పెద్దమొత్తంలో వాటాను శ్రీనివాస్‌రెడ్డికి ముట్టజెప్పి ఉంటాడని.. ఈ వ్యవహారమంతా ముకుందరెడ్డి ద్వారా జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం ఈడీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సోదాల్లో శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి ఇళ్లలో రూ.కోట్లలో నగదు బయటపడటంతో కుంభకోణంలో వీరి పాత్రపై ఆధారాలు లభించినట్లయింది. కుంభకోణం జరిగిన సమయంలో కార్మిక శాఖలోనే పనిచేసిన ఓ ఉన్నతాధికారి ప్రమేయంపైనాఆరోపణల నేపథ్యంలో ఈడీ తదుపరి దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది.
నాయినికి రాజకీయ వారసుడిగా గుర్తింపు
తెరాస తరఫున రాంనగర్ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డి గత ఎన్నికల్లో అదే డివిజన్ నుంచి ఓడిపోయాడు. నాయిని కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండటంతో అల్లుడైన శ్రీనివాస్‌రెడ్డే నాయినికి రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందాడు. నాయిని హోం, కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన తరఫున అన్ని వ్యవహారాలను చక్కబెట్టేవాడు. అప్పుడే కార్మిక శాఖలో ఈ కుంభకోణం యథేచ్ఛగా సాగిన నేపథ్యంలో నాయినికి తెలిసే ఈ వ్యవహారం నడిచిందా..? లేక శ్రీనివాస్‌రెడ్డే నడిపించాడా.? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.