తెలంగాణ

telangana

ETV Bharat / city

రూపీని రూపాయిగా మార్చిందెలా ?.. విదేశీ క్యాసినోల్లో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా - విదేశీ క్యాసినోల్లో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా

నేపాల్‌లో క్యాసినో నిర్వహణతో ఈడీకి చిక్కిన ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిల దందాపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలతో పాటు లాప్ టాప్‌లు, సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్‌కు కడ్తాల్‌లో ఫాం హౌజ్, హైదరాబాద్‌లో వాణిజ్య భవనాలు, ప్లాట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. ఈ క్రమంలోనే సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

విదేశీ క్యాసినోల్లో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా
విదేశీ క్యాసినోల్లో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా

By

Published : Jul 29, 2022, 4:56 AM IST

నేపాల్‌లో క్యాసినో నిర్వహణతో తమ వలకు చిక్కిన ఏజెంట్లు చీకోటి ప్రవీణ్‌, దాసరి మాధవరెడ్డిల దందాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లోతుగా ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘన జరిగిందని, పెద్దఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారిందని అనుమానిస్తున్న ఈడీ.. బుధవారం ఉదయం నుంచి రాత్రి ఒంటిగంట వరకు సోదాలు నిర్వహించి కీలక పత్రాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకొంది. నిందితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ప్రవీణ్‌కు కడ్తాల్‌లో ఫామ్‌హౌస్‌, నగరంలో వాణిజ్య భవనాలు ఉన్నట్లు , మరికొన్ని ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. ఈక్రమంలోనే సోమవారం తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరవ్వాలని వీరికి నోటీసులు జారీ చేసింది.

నగదు లావాదేవీలపైనే దృష్టి:నేపాల్‌ జాపాలోని హోటల్‌ మేచీ క్రౌన్‌లో గత జూన్‌ 10 నుంచి 13 వరకు 'క్యాసినో వెగాస్‌ బై బిగ్‌డాడీ' పేరిట పెద్దఎత్తున జరిగిన గ్యాంబ్లింగ్‌లో నగదు ఎలా చేతులు మారిందనేది ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో నిగ్గు తేలాల్సి ఉంది. క్యాసినోలో జరిగిన తీన్‌పత్తా, అందర్‌బాహర్‌ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పదుల సంఖ్యలో పంటర్లను హైదరాబాద్‌ నుంచి పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి జాపాకు రోడ్డుమార్గంలో తరలించి 4 రోజులపాటు హోటల్‌లో విడిది ఏర్పాటు చేయించారు. ఈ వ్యవహారానికి ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించారు. ఇందుకు ఒక్కో పంటర్‌నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఈక్రమంలో రూ.కోట్లలో నగదును విదేశీమారకంగా మార్చిన అంశంపైనే దృష్టి సారించింది. తొలుత రూపాయలను నేపాల్‌ రూపీల్లోకి ఎలా మార్చారు ? అక్కడ జూదం నిర్వహించేందుకు ఎంత విలువైన క్యాసినో కాయిన్లను కొన్నారు ? పంటర్లు గెలుచుకున్న రూపీలను తిరిగి రూపాయల్లోకి ఎలా మార్చారనే వివరాలు రాబట్టనున్నారు. నేపాల్‌ ప్రభుత్వం నుంచీ వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.

అయిదేళ్లలో క్యాసినో క్యాంపులెన్ని ?:గోవాలో బిగ్‌డాడీ క్యాసినోలో ప్రవీణ్‌ గతంలో జూదం నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. 2017 అక్టోబరులో హైదరాబాద్‌లోనే ఓ ప్రముఖ హోటల్‌లో క్యాసినో నిర్వహిస్తూ ప్రవీణ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. ఈక్రమంలో అయిదేళ్లుగా అతడు ఈ దందాలో ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. ఇటీవల గోవా, నేపాల్‌, బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేసియాల్లోనూ క్యాసినో నిర్వహణకు పాల్పడినట్లు అనుమానిస్తోంది. విదేశాలకు వెళ్లిన పంటర్ల ఆర్థిక లావాదేవీల గురించీ ఆరా తీస్తోంది.

బంగారం అక్రమ దిగుమతి కోణం ?:చెన్నైలో ఓ ప్రముఖ హవాలా ఏజెంటుకు ప్రవీణ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హవాలా దందాలో కీలకంగా ఉన్న అతడి కనుసన్నల్లోనే ప్రవీణ్‌ పనిచేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ కోణంలోనూ ఈడీ విచారించనున్నట్లు తెలిసింది. దుబాయ్‌ నుంచి విమానాల్లో బంగారం అక్రమ దిగుమతిపై దర్యాప్తు సంస్థల నిఘా విస్తృతంగా ఉండటంతో స్మగ్లర్లు నేపాల్‌బాట పట్టారనే ప్రచారం దృష్ట్యా ఈడీ వర్గాలు ఆ కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ:ప్రవీణ్‌ తన కార్యకలాపాలకు సంబంధించిన వీడియోల్ని తరచూ సామాజిక మాధ్యమ ఖాతాల్లో అప్‌లోడ్‌ చేస్తూ వచ్చాడు. క్యాసినో నిర్వహణకు సంబంధించిన ప్రచారాలనూ పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఈడీ వాటిని పరిశీలిస్తోంది. నేపాల్‌లో క్యాసినో నిర్వహణకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీతారలకు నోటీసులిచ్చే అవకాశముంది. క్యాసినోలో ప్రదర్శన ఇచ్చినందుకు వారికి భారీగా ముట్టజెప్పినట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో సినీతారల్నీ విచారించే అవకాశముంది.

చోద్యం చూస్తున్న అటవీశాఖ:ప్రవీణ్‌ విషయంలో అటవీశాఖ చోద్యం చూస్తోందన్న విమర్శలున్నాయి. కడ్తాల్‌లోని తన ఫాంహౌస్‌లో కొండచిలువలు, రామచిలుకలు, ఉడుములు వంటి వన్యప్రాణుల్ని బంధించినట్లు, వీటిని వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో అతనుపెట్టిన పోస్టింగ్‌లలో వెల్లడైంది. కడ్తాల్‌ ఆమన్‌గల్‌ అటవీ డివిజన్‌ పరిధిలోనిది. దీంతో అక్కడి ఎఫ్‌డీఓ జానకిరాంను 'ఈనాడు' వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డన్‌ స్వర్గం శ్రీనివాస్‌ను సంప్రదించగా.. ఈడీ నుంచి అటవీశాఖకు సమాచారం రావాల్సి ఉందని, అనంతరం శాఖాపరంగా స్పందన ఉంటుందన్నారు. 'విదేశాల్లోనే ఉండే వన్యప్రాణులు ప్రవీణ్‌ దగ్గర ఉన్నట్లు తెలిసింది. వాటిని అనుమతితో తెచ్చుకోవచ్చు' అని వార్డన్‌ వివరించారు.

ఈడీ విచారణకు హాజరవుతా:ఈడీ సోదాల అనంతరం ప్రవీణ్‌ ఐఎస్‌సదన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడాడు. 'గోవా, నేపాల్‌లలో క్యాసినో చట్టబద్ధం. అక్కడ నేను లీగల్‌గానే వ్యాపారం చేశాను. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు జరిగాయి. నోటీసిచ్చి సోమవారం రమ్మన్నారు. వారికి కొన్ని అనుమానాలున్నాయి. విచారణకు హాజరై వాటిగురించి వివరణ ఇస్తా' అని చెప్పాడు.

ప్రముఖులతో సంబంధాలు !తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మాజీ మంత్రి, ఏపీకి చెందిన మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యే, తెలంగాణలోని ఓ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌.., కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రవీణ్‌కు పరిచయాలున్నట్లు సమాచారం. కొందరు హవాలా ఏజెంట్లతోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి మొబైల్‌లో వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్ని ఈడీ విశ్లేషిస్తోంది.

కారు స్టిక్కర్‌ను మూణ్నెల్ల కిందటే పారేశా:క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మాధవరెడ్డి కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు, తనకు సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆ కారుకు ఉన్న స్టిక్కర్‌ మార్చికి సంబంధించిందని చెప్పారు. దాని కాలపరిమితి ముగియడంతో మూణ్నెల్ల కిందటే తీసి బయట పారేశానని చెప్పారు. దాన్ని తీసుకుని ఎవరో కారుకు పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి ప్రశ్నించారు.

ఇవీ చూడండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details