తెలంగాణ

telangana

ETV Bharat / city

EMPLOYEES PROTEST: పీఆర్సీకి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఉద్యోగుల నిరసనలు - prc latest updates

EMPLOYEES PROTEST: పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలు హోరెత్తాయి. ఏకపక్ష చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా వెనక్కితగ్గని ఉపాధ్యాయులు... పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని... లేకపోతే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

employesss protest over all
employesss protest over all

By

Published : Jan 20, 2022, 8:56 PM IST

పీఆర్సీకి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఉద్యోగుల నిరసనలు

EMPLOYEES PROTEST: కొత్త పీఆర్సీని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టగా... పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ప్రధాన ద్వారాలను మూసివేసి.... ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కావాలని తెచ్చుకున్న ప్రభుత్వమే కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

విశాఖ జిల్లాలో...

పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటూ... విశాఖలో జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ ఉపాధ్యాయులు ర్యాలీగా తరలివచ్చారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనకాపల్లిలో ఉపాధ్యాయులు నిరసన దీక్ష చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసిన ఉద్యోగులు... అధికారులకు వినతిపత్రం అందించారు. ఉద్యోగులను మభ్యపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశాఖ జీవీఎంసీ ఉపాధ్యాయులు ధ్వజమెత్తారు. విశాఖ జగదాంబ కూడలిలో ఉద్యోగులు తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. కాకినాడలో కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు.. పీఆర్సీ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించిన ఉద్యోగులు... ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళన ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు.


కృష్ణాజిల్లాలో...

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉపాధ్యాయుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. టీచర్లు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గుంటూరు కలెక్టరేట్ గేట్‌ ముందుకు వచ్చిన వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు.... రివర్స్ పీఆర్సీ వద్దంటూ మండిపడ్డారు. సమ్మెకు వెళ్లైనా తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాలో

ఫిట్‌మెంట్‌, హెచ్ఆర్ఏ సహా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం మోసం చేసిందంటూ రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యాన వేలాదిమంది నిరసనకు దిగారు. వారికి పెన్షనర్లు కూడా జత కలిశారు. పోలీసులు అడ్డగించడంతో కర్నూలు రాలేకపోయిన వారు... జిల్లాలో ఎక్కడికక్కడ నిరసనలతో హోరెత్తించారు.

కడప జిల్లాలో...

కడపలో ఉపాధ్యాయుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. లోపలికి వెళ్లేందుకు యత్నించిన వారిని... బారికేడ్లు, ముళ్లకంచెలతో పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని బలవంతంగా అరెస్టు చేశారు. దీనిపై టీచర్లు తీవ్రంగా మండిపడ్డారు.

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు జిల్లాలో పోలీసుల ఆటంకాలను దాటుకుంటూ గురువులు కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ధర్నా తర్వాత కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రధాన ద్వారాన్ని నెట్టుకుంటూ వెళ్లబోయిన యూటీఎఫ్ నేత రమణకు ఇనుప చువ్వలు గుచ్చుకుని భుజానికి గాయమైంది. ఆయన్ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అనంతపురం జిల్లాలో...
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అనంతపురం కలెక్టరేట్ ప్రాంతం హోరెత్తింది. పాలకులు దిగివచ్చే దాకా పోరాటం ఆగదని ఉపాధ్యాయులు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు.

ప్రకాశం జిల్లాలో..

ఒక్కఛాన్స్‌ అంటూ గద్దెనెక్కిన జగన్‌... తన నిర్ణయాలతో ఇదే ఆఖరి ఛాన్స్ చేసుకుంటున్నారని ప్రకాశం జిల్లా ఉద్యోగులు అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రజా సంక్షేమంలో భాగమని ప్రభుత్వం గుర్తించాలన్నారు.ఊరూరా ప్యాలెస్‌లు కట్టుకున్న పాలకులు... తమ హెచ్ఆర్ఏ కి గండికొట్టడమేంటని ఉద్యోగులు నిలదీశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details