EPFO Server Issue : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఈపీఎఫ్‌వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చినా గత నెలన్నర రోజులుగా సర్వర్ సమస్యలు తలెత్తాయి. ఎప్పుడు సమస్య పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో రోజుల తరబడి సాంకేతిక సమస్యలతో వేతన జీవులు, కార్మికులకు సేవలు నిలిచిపోయాయి. చివరకు అత్యవసరానికి నగదు ఉపసంహరణ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈపీఎఫ్ ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణం, చికిత్సలు, పిల్లల ఉన్నత విద్య, వివాహం, కరోనా ఉపసంహరణలు చేసుకోలేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్‌వో సేవలకు ఈ-నామినేషన్ తప్పనిసరి చేశారు. దాంతో ఒక్కసారిగా లక్షల మంది ప్రతిరోజూ పోర్టల్‌ను సందర్శిస్తుండటంతో తరచూ మొరాయిస్తోంది. ప్రస్తుతం దాదాపు ఏడు కోట్ల మంది చందాదారుల్లో 52 లక్షల మంది ఈ-నామినేషన్ పూర్తయింది.
పోర్టల్‌లో సమస్యలివీ..
EPFO Server Problem : ఈపీఎఫ్‌వో మెంబర్‌పోర్టల్‌లో యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్‌లో సమస్యలు
పేజీ తెరుచుకున్నా, వివరాలు నమోదు చేసిన వెంటనే సర్వర్‌డౌన్ డౌన్
ఈ-నామినేషన్ తరువాత ఈ-సిగ్నేచర్‌కు సీ-డాక్ నుంచి సాంకేతిక సమస్యలు
ఈ-నామినేషన్ పూర్తయ్యాకే మిగతా సర్వీసులకు అనుమతించడంతో ఆర్థిక కష్టాలు