తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐటీకి వలసల పోటు.. ఉద్యోగుల తీరుతో కంపెనీలు బెంబేలు - IT companies in hyderabad

ఐటీ ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారడం సాధారణమే.. అయితే కొవిడ్‌ పరిణామాల అనంతరం డిజిటల్‌ నిపుణులకు గిరాకీ విపరీతంగా పెరగడంతో, సిబ్బంది వలసలు అనూహ్యంగా పెరిగాయి. నిపుణులను నిలుపుకోడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థల నుంచి మెరుగైన ఆఫర్లు ఆకర్షిస్తుండటంతో సిబ్బంది వెళ్లిపోతున్నారు. దీనివల్ల కంపెనీలకు జీతభత్యాల భారం పెరిగిపోవటం ఒక సమస్య అయితే, ఖాళీలను అవసరమైన నిపుణులతో భర్తీ చేయడం మరొక సమస్యగా మారింది.

employees migration increased in IT companies
employees migration increased in IT companies

By

Published : Apr 17, 2022, 10:44 AM IST

ఐటీ పరిశ్రమ గతంలో ఎన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ‘అట్రిషన్‌ రేటు’ పెరిగింది. పరిశ్రమలో సగటు వలసల రేటు 15- 16 శాతంగా ఉంటే ఇప్పుడు 20-25 శాతానికి చేరింది. ఈ సమస్య చాలా కాలం పాటు పరిశ్రమను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య చిన్న కంపెనీల నుంచి అగ్రశ్రేణి ఐటీ కంపెనీల వరకూ దాదాపు ఒకే రకంగా ఉంది.

దిగ్గజ కంపెనీలకూ తప్పడం లేదు..:దిగ్గజ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో అట్రిషన్‌ రేటు 17.4 శాతం ఉన్నట్లు వెల్లడించింది. ఇది త్వరలోనే 20 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరో రెండు త్రైమాసికాల పాటు ఈ సమస్య ఉంటుందని అంచనా వేస్తోంది. మరొక అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ పరిస్థితీ ఇంతే. ఈ సంస్థలో ప్రస్తుతం 3.14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉద్యోగుల సంఖ్య 2.59 లక్షలు మాత్రమే. ఏడాది వ్యవధిలో దాదాపు 55,000 మంది ఉద్యోగులు అదనంగా జతకలిశారు. అదే సమయంలో అట్రిషన్‌ రేటు 27.7 శాతానికి పెరిగింది. 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇది 25.5 శాతం కావడం గమనార్హం. గత ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో వలసల రేటు 10.9 శాతమే. మంచి అవకాశాలను వెతుక్కుంటూ నిపుణులు వెళ్లిపోవడం అనే సమస్య ఐటీ రంగంలోని ఇతర దిగ్గజ కంపెనీలకూ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని అధిగమించడంపై ఆయా కంపెనీల యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నాయి.

డిజిటల్‌ ప్రాజెక్టులతోనే..:వలసల రేటు ఎంతో అధికంగా ఉండటానికి డిజిటల్‌ టెక్నాలజీ ప్రాజెక్టులు అధికంగా రావటమే ప్రధాన కారణమని హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు భరణి కె.అరోల్‌ అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్‌ మహమ్మారి పరిణామాల్లో వివిధ రంగాల సంస్థలు డిజిటల్‌ టెక్నాలజీలను అధికంగా అమలు చేస్తున్నాయి. కృత్రిమ మేధ, యంత్ర విద్య, బ్లాక్‌చైన్‌, సైబర్‌ సెక్యూరిటీ టెక్నాలజీస్‌కు డిమాండ్‌ ఎంతగానో పెరిగింది. అమెరికా, ఐరోపా దేశాల సంస్థలు పెద్దఎత్తున డిజిటల్‌ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. దీనికి బడ్జెట్ల కేటాయింపు కూడా గతంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగింది. ఈ ప్రాజెక్టులు మనదేశంలోని ఐటీ కంపెనీలకు లభిస్తున్నాయి. మనదేశంలో దాదాపు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, అందులో డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులు కొంతకాలం క్రితం వరకూ 8 శాతం మందే ఉన్నారు. ఈ సంఖ్య ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. అయినా ప్రాజెక్టులు అధికంగా లభిస్తున్నందున ఈ నిపుణుల సంఖ్య సరిపోవటం లేదు. అందువల్ల కొత్తగా ప్రాజెక్టు సంపాదించిన కంపెనీలు, సంబంధిత నిపుణులను ఇతర కంపెనీల నుంచి అధిక జీతభత్యాలతో తీసుకుంటున్నాయి. ప్రస్తుత సమస్యకు ఇదే ప్రధాన కారణం. ‘ఆఫీసుకు రావాలని కోరుతున్న’ కంపెనీలను వదలిపెట్టి ‘ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చే కంపెనీలకు’ మరికొందరు వెళ్లిపోతున్నారు. కొంతకాలం పాటు ఈ సమస్య తప్పేటట్లు లేదు’’ అని వివరించారు.

కంపెనీల మధ్య అవగాహన..:ఉద్యోగుల వలసల వేగాన్ని నియంత్రించడానికి ఐటీ కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పరస్పరం అవగాహనకు వస్తున్నాయి. ‘మీ ఉద్యోగులను మేం తీసుకోం, మా ఉద్యోగుల్ని మీరు తీసుకోవద్దు’ అనే అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. ఇందుకోసం కొన్ని విధివిధానాలు నిర్దేశించుకున్నట్లు సమాచారం.

భారీగా తాయిలాలు..!మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు భారీగా తాయిలాలు ఇవ్వజూపుతున్నాయి. నిపుణులు, బాగా పనిచేసే ఉద్యోగులను గుర్తించి వారికి బంగారు నాణేలు, కార్లు, ఐఫోన్లు... వంటి ఖరీదైన బహుమతులు ఇస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను విహార యాత్రలకు పంపించడం, నగదు బహుమతులు ఇవ్వడం, ఇతర సదుపాయాలు కల్పించటం చేస్తున్నాయి. చెన్నైలో ఒక ఐటీ కంపెనీ ఇటీవల తమ ఉద్యోగులకు వంద కార్లు బహుమతిగా ఇచ్చింది. ఏటా కొందరు ఉద్యోగులను ఎంపిక చేసి, ఖరీదైన బహుమతులు ఇవ్వటం ఈ కంపెనీ యాజమాన్యానికి అలవాటు. ఆ కోవలోనే ఈసారి కార్లు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇలా ఐటీ కంపెనీలను ఉద్యోగులు వెళ్లిపోకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details