తెలంగాణ

telangana

ETV Bharat / city

EMPLOYEES JAC LEADERS: 'రేపట్నుంచి అందరిదీ ఒకే మాట, ఒకే వాదన, ఒకే డిమాండ్'

EMPLOYEES JAC LEADERS: పీఆర్‌సీ అంశంలో ఏపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఆ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ సాధన కోసం అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.

employessss jac leaders
employessss jac leaders

By

Published : Jan 20, 2022, 10:42 PM IST

EMPLOYEES JAC LEADERS: పీఆర్‌సీ అంశంలో ఏపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఆ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఉమ్మడి పోరాటంపై సమాలోచనలు జరిపారు. ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘పీఆర్సీ సాధన కోసం అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించాం. రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయ జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయంలో సమావేశమై ఉమ్మడి పోరాటం విధి విధానాలు రూపొందిస్తాం. ఇవాళ్టి వరకూ ఆయా సంఘాల నిర్ణయం మేరకు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. రేపటి నుంచి ఏ ఆందోళన చేపట్టినా నాలుగు సంఘాలు కలిసే చేస్తాయి. కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతోంది. అందుకే అందరం కలిసి పోరాడాలని నిర్ణయించాం. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు ఉన్నప్పటికీ అన్నీ పక్కన పెట్టి మెరుగైన పీఆర్సీ సాధించాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై రేపటి సమావేశంలో చర్చిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిర్ణయాన్ని మార్చుకోవాలి’’అని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసులు నిన్న ప్రకటించారు. సమ్మె నోటీసు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. సమ్మె నోటీసుపై రేపటి సమావేశంలో మిగిలిన సంఘాలతో కూడా చర్చిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details