తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఆర్సీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..

పీఆర్సీ కమిటీ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న కమిటీ సిఫార్సులను తప్పుపడుతూ... ఆందోళనలకు దిగాయి. నివేదిక ప్రతులను తగులబెట్టి.... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

TS PRC PROTESTS
పీఆర్సీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..

By

Published : Jan 27, 2021, 8:45 PM IST

పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా యూటీఎఫ్‌ నిరసన చేపట్టింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలో పీఆర్‌సీ కమిషన్‌ ప్రతులను చించివేశారు. కేవలం ఏడున్నర శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీని పే రిడక్షన్‌ కమిటీగా అభివర్ణించారు. నిరసనకు దిగిన యూటీఎఫ్ ప్రతినిధులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

47.5 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి..

పీఆర్సీ నివేదికను తక్షణమే తిరస్కరించి.. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం సమావేశం కావాలని ఇంటర్ విద్య ఐకాస అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి.. ఉద్యోగులు శాశ్వతంగా దూరమవుతారని హెచ్చరించారు. తక్షణమే 47.5 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డులోని జయశంకర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

మంత్రి రాజీనామా చేయాలి..

ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌లో వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పీఆర్సీ ప్రతులు తగలబెట్టి నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. జగిత్యాల తహసీల్దార్​ చౌరస్తాలో ఉపాధ్యాయుల సంఘం ధర్నా నిర్వహించింది. ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్​ఆర్​ఏ తగ్గిస్తున్నారని హన్మకొండలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి జాతీయ రహదారిపై ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. నారాయణపేట జిల్లా అంబేద్కర్ చౌరస్తా దగ్గర తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీ నివేదికపై మండిపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిటీ నివేదిక దారుణమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్‌లో ఆరోపించింది.

ఇవీచూడండి:43 శాతం ఫిట్‌మెంట్‌ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

ABOUT THE AUTHOR

...view details