తెలంగాణ

telangana

ETV Bharat / city

జీపీఎఫ్‌ డబ్బు అందక కుమార్తె పెళ్లిని వాయిదా వేసిన చిరుద్యోగి - ap latest updates

GPF money : దరఖాస్తు చేసినా జీపీఎఫ్‌ డబ్బు రాకపోవడంతో ఓ ఉద్యోగి.. తన కుమార్తె పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఖాతాలో ఉన్న సుమారు రూ.15 లక్షల్లో రూ.11 లక్షల వరకు సొమ్ము వస్తుందనే ఆశతో ఈ నెల 24న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. సమయం దగ్గర పడినా నగదు రాలేదు. చేసేదిలేక వారం పాటు వాయిదా వేసుకున్నారు.

GPF money
GPF money

By

Published : Jul 22, 2022, 11:48 AM IST

GPF money : భవిష్య నిధి (జీపీఎఫ్‌) నుంచి రుణం అందక ఓ చిరుద్యోగి కుమార్తె పెళ్లి వాయిదా పడింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన షేక్‌ గౌస్‌బాషా తహసీల్దారు కార్యాలయంలో అటెండరుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై ఉన్నారు. ఆయన తన కుమార్తె పెళ్లి కోసం జీపీఎఫ్‌ నుంచి రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఖాతాలో ఉన్న సుమారు రూ.15 లక్షల్లో రూ.11 లక్షల వరకు సొమ్ము వస్తుందనే ఆశతో ఈ నెల 24న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. సమయం దగ్గర పడినా నగదు రాలేదు. చేసేదిలేక వారం పాటు వాయిదా వేసుకున్నారు. అయినా స్పష్టత లేక ఆయన కుటుంబం కలత చెందుతోంది.

సాధారణంగా అయితే శాఖాపరంగా పై అధికారి సమ్మతి, స్థానిక ట్రెజరీ కార్యాలయ ఆమోదం పొందిన రెండు మూడు రోజుల్లోనే ఈ సొమ్ము వస్తుంటుంది. ఇటీవల జీపీఎఫ్‌ ఖాతాల్లో జరిగిన తిర‘కాసు’ వ్యవహారంతో ఇలా రుణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ట్రెజరీ వర్గాలు అంటున్నాయి. దీనిపై వివరణ కోరగా.. ప్రభుత్వానికి ప్రతిపాదించడం వరకే తమ పని అని జిల్లా ట్రెజరీ అధికారి గంగాద్రి తెలిపారు. ఒక్కోసారి వారం, 15 రోజుల వరకు సమయం పడుతుందని తెలిపారు. సకాలంలో రాకపోవచ్చేమోగానీ తప్పకుండా వస్తాయని వివరించారు. ‘మా కుమార్తె పెళ్లి, భార్య ఆరోగ్యం నిమిత్తం రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం స్పందించాలి’ అని గౌస్‌ బాషా అర్థిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details