తెలంగాణ

telangana

ETV Bharat / city

River Boards: కీలకాంశాలపై నదీ యాజమాన్య బోర్డుల అత్యవసర భేటీ - krishna river board latest news

కీలకాంశాలపై నదీ యాజమాన్య బోర్డుల అత్యవసర సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల తొమ్మిదిన గోదావరి బోర్డు అత్యవసర పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డు సమావేశం ఎప్పుడన్నది గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

River Boards: కీలకాంశాలపై నదీ యాజమాన్య బోర్డుల అత్యవసర భేటీ
River Boards: కీలకాంశాలపై నదీ యాజమాన్య బోర్డుల అత్యవసర భేటీ

By

Published : Aug 5, 2021, 6:50 AM IST

గెజిట్‌ నోటిఫికేషన్‌లోని కీలకాంశాల అమలుపై చర్చించేందుకు నదీ యాజమాన్య బోర్డులు అత్యవసర సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల తొమ్మిదిన గోదావరి బోర్డు అత్యవసర పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి బి.పి.పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. అదే రోజు లేదా మరుసటి రోజు కృష్ణా బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది.

గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం బోర్డు నిర్వహణ అంశాలను ఖరారు చేయడం, షెడ్యూలు-2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేయడం, నోటిఫికేషన్‌ నాటికి ఆయా ప్రాజెక్టుల్లో మంజూరు చేసిన పోస్టులు, ఉన్న సిబ్బంది, యంత్రాలు, పరికరాలు, వాహనాలు, ప్రాజెక్టు నివేదికలు, రికార్డు రూముల స్వాధీనం తదితర అంశాలను ఎజెండాలో చేర్చారు. అనధికారిక ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతులు పొందడం, రాకపోతే నిలిపివేయడం, సీడ్‌మనీ కింద బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున ఇవ్వడం తదితర అంశాలు గోదావరి బోర్డు ఎజెండాలో ఉన్నాయి. కృష్ణా బోర్డు సమావేశం ఎప్పుడన్నది గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాయలసీమ ఎత్తిపోతల పర్యటన వాయిదా

రాయలసీమ ఎత్తిపోతల పర్యటనను కృష్ణా నదీ యాజమాన్యబోర్డు వాయిదా వేసుకొంది. మొదట ఈ నెల అయిదో తేదీ వెళ్లాలని నిర్ణయించగా, కమిటీలో రెండు రాష్ట్రాలకు చెందిన వారు లేకుండా చూడాలని బుధవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలతో పర్యటనను వాయిదా వేసినట్లు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే ఆంధ్రప్రదేశ్‌కు సమాచారమిచ్చారు. హరిత ట్రైబ్యునల్‌ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు బోర్డు సన్నాహాలు చేసింది. బోర్డు సభ్యులు హెచ్‌.కె.మీనా నేతృత్వంలో సభ్యకార్యదర్శి రాయిపురే, మరో సభ్యులు ముతుంగ్‌, కేంద్రజలసంఘం హైదరాబాద్‌ కార్యాలయంలో డైరెక్టర్‌గా ఉన్న దేవేందర్‌రావులతో కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్‌.కె.మీనా జులై 31న పదవీ విరమణ చేయడంతో సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో ఈ నెల అయిదున పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. కానీ కమిటీలో సభ్యునిగా ఉన్న దేవేందర్‌రావు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారు.

కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన వారిని ఛైర్మన్‌, సభ్యకార్యదర్శి, సభ్యులుగా నియమించరాదని పేర్కొందని, దేవేందర్‌రావు తెలంగాణకు చెందిన వారైనందున బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయించాలని కోరారు. బుధవారం గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీంతో కమిటీలో రెండు రాష్ట్రాలకు చెందిన వారు లేకుండా చూడాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకొంటున్నామని కృష్ణా బోర్డు బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

ఇదీ చూడండి: Meeting: గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం ఇకపై తరచూ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details