TTD OSD DOLLAR SESHADRI PASSES AWAY: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్(embalming) చేయమని తితిదే కోరినట్లు ఏఎంసీ(Andhra medical college) ప్రిన్సిపల్ పీవీ సుధాకర్ తెలిపారు. రవీంద్ర కిశోర్ నేతృత్వంలో అనాటమీ విభాగంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. దీనికి రెండు గంటలు సమయం పట్టిందని తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.
తితిదే ప్రధానార్చకులు, ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి.. అపోలో ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు ఎంబామింగ్ చేశాం. ఆంధ్రా వైద్య కళాశాల అనాటమీ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాం. ఆయన కొవిడ్‌తో చనిపోలేదు. గుండెపోటుతో చనిపోయారు. ఆయన పార్థివ దేహం ఎక్కువ కాలం ఉండేందుకు ఎంబామింగ్ చేశాం. -పీవీ సుధాకర్, ఏఎంసీ ప్రిన్సిపల్
డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి కొవిడ్ నిబంధనలు వర్తించవని పీవీ సుధాకర్ స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. ఎంబామింగ్ ప్రక్రియ వల్ల ఆరు మాసాలు వరకు భౌతిక దేహం పాడు కాదని పేర్కొన్నారు. శేషాద్రి పార్థివ దేహానికి.. ప్రయాణానికి తగినట్లు ఏర్పాటు చేసినట్లు పీవీ సుధాకర్ వెల్లడించారు.