తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతుచిక్కని వ్యాధి... అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన - ఏలూరు తాాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ‍ఏం జరుగుతుందో తెలియడం లేదు.... ఎందుకు వ్యాపిస్తుందో అర్థం కావడం లేదు. కానీ రోజూ వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటివరకు 464 మంది వింత వ్యాధి బారిన పడగా... 289 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అంతుచిక్కని అనారోగ్యంపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర వైద్య బృందం మంగళవారం ఏలూరు రానుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) ప్రతినిధులూ వచ్చి పరిస్థితిని పరిశీలించనున్నారు.

jagan
jagan

By

Published : Dec 7, 2020, 10:30 PM IST

అంతుచిక్కని వ్యాధి...అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన

అంతుచిక్కని వ్యాధి ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. మూర్ఛ, తల తిరగడం, నోట్లో నురగ రావడం లాంటి లక్షణాలతో మూడోరోజూ చాలామంది ఆసుపత్రిలో చేరారు. మొత్తంగా మూడు రోజుల వ్యవధిలో వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. అందులో కొందరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికీ ఏలూరులో కొందరు చికిత్స పొందుతుండగా.... విజయవాడ, గుంటూరు లాంటి ఇతర ప్రాంతాలకు మరికొందరిని తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణవీధి వాసులు ముందుగా అనారోగ్యం బారిన పడగా... అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించి బాధితుల సంఖ్య ఎక్కువైంది.

ఎయిమ్స్​కు నమూనాలు

రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించిన ఏలూరు వైద్యులు... దిల్లీ ఎయిమ్స్‌కు పంపించారు. 8 మంది సభ్యుల బృందం... బాధితుల నుంచి రక్త, మూత్ర నమూనాలు, వెన్నుపూసలో నీటి నమూనాలు తీసుకుంది. అన్నిరకాల వైద్య పరీక్షలు జరిపినా రోగ కారణాలు తెలియలేదని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. ఆహారం, నీటితో పాటు పర్యావరణానికి సంబంధించిన అంశాలపై కూడా అధ్యయనం చేయనున్నట్టు వివరించారు.

ఏలూరుకు రేపు కేంద్ర బృందం

ఏలూరులో అంతుపట్టని విధంగా అస్వస్థతకు గురైన ఐదుగురుకి గుంటూరు జీజీహెచ్​లో వైద్యచికిత్సలు కొనసాగుతున్నాయి. బాగా ఉన్నవారు అకస్మాత్తుగా మూర్ఛ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని బాధితుల బంధువులు చెబుతున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసేవలపై జీజీహెచ్​ సూపరింటెండెంట్ ప్రభావతి.... ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఆమె తెలిపారు. అంతుచిక్కని వ్యాధిపై అధ్యయనానికి.... కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల వైద్య బృందాన్ని ఏలూరుకు పంపుతోంది. మంగళవారం ఉదయానికి ఏలూరు చేరుకోనున్న బృందం... సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రతినిధులు రానున్నారు.

మరో నాలుగు బృందాలు

అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులకు చికిత్స ఆలస్యం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. డిశ్చార్జి అయినవారికి పోషకాహారం అందించాలని నిర్దేశించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సీఎం... పరిస్థితిపై వైద్యులతో సమీక్షించారు. అంతా కుదటపడే వరకు వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ ఏలూరులోనే ఉంటూ... పరిస్థితిని సమీక్షించాలని దిశానిర్దేశం చేశారు. బాధితుల్ని పరామర్శించిన అనంతరం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమీక్షించారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం అధికారులు సీఎంకు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హైదరాబాద్‌ సీసీఎమ్​బీకి 10 నమూనాలను పంపించామన్న అధికారులు... ఐసీఎమ్​ఆర్ సహా మరో నాలుగు కేంద్ర బృందాలు ఏలూరు వస్తాయని వివరించారు. దిల్లీ ఎయిమ్స్‌కూ నమూనాలు పంపించామన్నారు.

చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితి : చంద్రబాబు

ఏలూరులో తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉంటే ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా..మొక్కుబడిగా ఓ సమీక్ష నిర్వహించి వెళ్లిపోవడం ఏంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేదెవరన్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏలూరులో పరిస్థితి నెలకొందని..ప్రభుత్వం వేగంగా స్పందించాలని చంద్రబాబు సూచించారు.

ఇవీ చదవండి :ఏలూరు ఘటనపై అధ్యయనానికి కేంద్ర కమిటీ : కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details